
అయితే ప్రసవం తర్వాత అన్ని పనులూ ఒక్కరే చేయడం కష్టం. అలాంటప్పుడు కుటుంబం, స్నేహితుల సహాయం తీసుకోవడానికి భయపడకండి. ఇతర పనులు చేయడానికి లేదా ఇంట్లో ఉన్న మిగిలిన పిల్లల బాగోగులు చూసుకోడవడానికి సహాయం చేస్తారు. వీలుంటే పని మనిషిని పెట్టుకోవడం వల్ల మీకు ఇబ్బంది లేకుండా చూసుకోవచ్చు. వ్యాయామం చేయడం సురక్షితమైనప్పుడు వైద్యులు మీకు తెలియజేస్తారు. వీలైనంతవరకూ ఇంటి సమీపంలో నడవడం వల్ల ఉత్తేజాన్ని పొందుతారు. ఉదయం సూర్యుడి నుంచి వచ్చే కాంతి తల్లి, బిడ్డకు ఎంతో మంచిది. తోటలు, పొలాల్లో సూర్యరశ్మితో పాటు స్వచ్ఛమైన గాలి అందుతుంది. ఇలాంటిచోట వాకింగ్ చేయడం మంచిది.
ఇక ప్రసవం తర్వాత బిడ్డతోనే పూర్తిగా సమయం అంతా సరిపోతుంది. కానీ కాస్త ప్రయత్నించి మీ కోసం సమయం కేటాయించండి. ఇక ప్రతిరోజూ కనీసం 15 నిమిషాలు దీర్ఘ శ్వాస తీసుకుంటూ ధ్యానం చేయండి. దీనివల్ల ఒత్తిడి తగ్గి, హార్మోన్లు సరైన స్థాయికి చేరుకుంటాయి. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల చక్కటి విశ్రాంతి దొరుకుతుంది. ప్రసవానంతరం చాలామంది మహిళలు ఒంటరిగా ఫీలవుతారు. ఇలాంటప్పుడే మీరు కుటుంబంతో వీలైనంత ఎక్కువ సమయాన్ని గడిపేందుకు ప్రయత్నించాలి. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో వీలైనంత ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.