నేటితో అనగా ఆగ‌స్ట్ 22తో మొగాస్టార్ చిరంజీవి 65 వసంతాలు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ అభిమానులకు ఇండియా హెరాల్డ్ ప్రత్యేక కానుకగా ఆయన జీవితంలో ఇప్పటివరకూ జరిగిన విశేషాలను అందిస్తుంది.


చిరంజీవి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని మొగల్తూరు గ్రామంలో 1955లో ఆగష్టు 22న అంజ‌నాదేవి, వెంక‌ట్రావు దంప‌తుల‌కు జ‌న్మించారు. ఆయ‌న అస‌లు పేరు కొణిదెల శివ‌శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌. చిరంజీవి తండ్రి వెంక‌ట్రావు పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ప‌నిచేసినందువ‌ల్ల త‌ర‌చూ ట్రాన్స్‌ఫ‌ర్ అవుతుండేవారు. అందువ‌ల్ల చిరంజీవి బాల్యంలో నాయ‌న‌మ్మ, తాత‌య్య‌ల వ‌ద్ద ఎక్కువ‌గా గ‌డిపారు. చిన్న‌త‌నం నుంచే న‌ట‌న మీద ఆయ‌న ప్రేమ పెంచుకున్నారు. న‌ర్సాపురంలో బీకామ్ డిగ్రీ చేశాక సినిమాల్లో చేరాల‌నే కోరికతో చెన్నై వెళ్లారు. మ‌ద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో 1976లో న‌ట‌న‌లో శిక్ష‌ణ కోసం చేరారు. తొలిగా 'పునాదిరాళ్లు' అనే సినిమాలో అవ‌కాశం ద‌క్కించుకున్నారు. కానీ మొదటగా విడుద‌లైన చిత్రం 'ప్రాణం ఖ‌రీదు' (1978). ఆ త‌ర్వాత ఏడాది 'తాయార‌మ్మ బంగార‌య్య' చిత్రంలో చేసిన హీరో పాత్ర‌తో అంద‌రి నోళ్ల‌లో నానారు. మ‌రోవైపు మోస‌గాడు, పున్న‌మి నాగు, న్యాయం కావాలి, 47 రోజులు వంటి సినిమాల్లో చేసిన‌ నెగ‌టివ్ రోల్స్‌తో న‌టుడిగా పేరు తెచ్చుకున్నారు. చిరంజీవి 1980లో ప్రముఖ హాస్య‌న‌టులు అల్లు రామ‌లింగ‌య్య కుమార్తె సురేఖ‌ను వివాహం చేసుకున్నారు.1982లో కోడి రామ‌కృష్ణ డైరెక్ష‌న్‌లో చేసిన 'ఇంట్లో రామ‌య్య... వీధిలో కృష్ణ‌య్య' చిత్రం సూప‌ర్ హిట్ కావ‌డంతో హీరోగా ఒక మెట్టు పైకెక్కారు చిరంజీవి.ఇక 1983లో వ‌చ్చిన 'ఖైదీ' సినిమా ఏకంగా చిరంజీవి కెరీర్ దిశ‌నే మార్చేసింది.ఆ సినిమాతో టాలీవుడ్‌లో స‌రికొత్త యాక్ష‌న్ స్టార్‌గా అవ‌త‌రించారు చిరంజీవి. ఛాలెంజ్‌, విజేత‌, దొంగ‌మొగుడు, ప‌సివాడి ప్రాణం సినిమాల త‌ర్వాత నంబ‌ర్‌వ‌న్ హీరోగా మారారు. తర్వాత రాఘవేంద్రరావు దర్శకత్వంలో శ్రీ‌దేవితో క‌లిసి న‌టించిన 'జ‌గ‌దేక‌వీరుడు అతిలోక సుంద‌రి' (1990)తో ఇండ‌స్ట్రీ హిట్ సాధించారు. 1992లో వ‌చ్చిన 'ఘ‌రానా మొగుడు' సినిమా టాలీవుడ్‌లో 10 కోట్ల రూపాయ‌ల గ్రాస్ సాధించిన మొద‌టి సినిమాగా అలాగే కోటి రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకున్న మొట్టమొదటి హీరోగా చిరంజీవి రికార్డులు సృష్టించింది.


ఇక పిల్లల విషయానికి వస్తే త‌న‌యుడు రామ్‌చ‌ర‌ణ్, తండ్రి వార‌స‌త్వాన్ని పుణికి పుచ్చుకొని న‌టుడిగా సినిమాల్లో అడుగుపెట్టి, నేటి త‌రం స్టార్ హీరోల్లో ఒక‌డిగా రాణిస్తున్నాడు. 1985 మార్చి 27న పుట్టిన చ‌ర‌ణ్ 2007లో పూరి జ‌గ‌న్నాథ్ డైరెక్ట్ చేసిన 'చిరుత' సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మ‌య్యాడు. నటుడిగా రాణిస్తూనే చ‌ర‌ణ్ మ‌రోవైపు బిజినెస్‌మ్యాన్‌గానూ పేరు తెచ్చుకుంటున్నాడు. 2012 జూన్ 14న ఉపాస‌న కామినేనిని ప్రేమ వివాహం చేసుకున్నాడు చ‌ర‌ణ్‌. ఆమె అపోలో హాస్పిట‌ల్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మ‌న్ ప్ర‌తాప్ సి. రెడ్డి మ‌న‌వ‌రాలు. పెద్ద‌మ్మాయి సుస్మిత, చిన్న‌మ్మాయి శ్రీ‌జ‌. 2006లో విష్ణుప్ర‌సాద్‌తో సుస్మిత వివాహం జ‌రిగింది. ఆ త‌ర్వాత కొంత కాలానికే శ్రీ‌జ ఇంట్లోంచి వెళ్లిపోయి 2007లో శిరీష్ భ‌ర‌ద్వాజ్ అనే యువ‌కుడిని ఆర్య‌స‌మాజ్‌లో ప్రేమ వివాహం చేసుకుంది. కానీ స్వ‌ల్ప కాలానికే ఆ ఇద్ద‌రి మ‌ధ్యా మనస్పర్ధలు త‌లెత్తాయి. దాంతో పుట్టింటికి తిరిగొచ్చేసిన శ్రీ‌జ‌, క‌ట్నం కోసం శిరీష్ వేధిస్తున్నాడంటూ ఆరోపించింది. ఆ ఇద్ద‌రూ విడాకులు తీసుకున్నారు. త‌ల్లిదండ్రుల కోరిక మేర‌కు 2016లో న‌గ‌ల వ్యాపారి క‌ల్యాణ్‌దేవ్‌ను ఆమె వివాహ‌మాడింది.ఇటీవలే కళ్యాణ్ దేవ్ కూడా హీరోగా తెరంగేట్రం చేసిన విషయం తెలిసిందే.


కెరీర్లో ఉత్త‌మ న‌టుడిగా ప‌ది సార్లు ఫిల్మ్‌ఫేర్ అవార్డుల‌ను చిరంజీవి అందుకున్నారు. రెండు ద‌శాబ్దాల కాలం నంబ‌ర్‌వ‌న్ స్టార్‌గా వ‌చ్చిన పేరు ప్ర‌ఖ్యాతుల‌తో ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ కావాల‌నే ఉద్దేశ్యంతో రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టాల‌ని భావించి 2008లో ప్ర‌జా రాజ్యం పార్టీని స్థాపించారు. అయితే ఎన్నిక‌ల్లో ఊహించ‌ని విధంగా కేవలం 18 సీట్లకే పరిమితమై పార్టీ ఓట‌మి పాల‌వ‌డంతో మూడేళ్ల‌కే ప్ర‌జా రాజ్యంను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసారు. మరలా తొమ్మిదేళ్ల విరామం తర్వాత 'ఖైదీ నంబ‌ర్ 150' (2017)గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌ను సాధించారు. గ‌త ఏడాది 'సైరా..న‌ర‌సింహారెడ్డి' సినిమాతో అల‌రించిన ఆయ‌న ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో 'ఆచార్య' మూవీ చేస్తున్నారు. ప్రస్తుతం రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటూ కేవలం న‌ట‌న‌పైనే పూర్తిగా దృష్టిపెట్టిన మెగాస్టార్ ఇప్ప‌టికే మ‌రో మూడు సినిమాల‌ను కూడా అనౌన్స్ చేసి 65 ఏళ్ల వయసులో కూడా తన దూకుడును చూపిస్తూ యువ హీరోలకు మార్గదర్శిగా నిలుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: