విశాఖ సమీపంలోని ఆర్‌ఆర్‌ వెంకటాపురంలో ఎల్‌జీ పాలీమర్స్‌ పరిశ్రమ నుంచి గ్యాస్‌ లీకైన ఘటన అలజడి రేపుతోంది. ఆ ప్రాంతంలో ఇళ్లలోనూ ప్రజలు స్పృహ తప్పి పడిపోతున్నట్లు తెలిసింది.  నగర పరిధిలోని  గోపాలపట్నంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్‌ లో గ్యాస్‌ లీక్ కాగా, ఇప్పటివరకూ ఎనిమిది మంది మరణించారు. ఈ ఘటన తరువాత 3 నుంచి 5 కిలోమీటర్ల మేరకు విష వాయువులు విస్తరించగా, పలువురు తీవ్ర అస్వస్థతకు గురై, విశాఖ కేజీహెచ్ కి పరుగులు పెట్టారు. ఇప్పటికే సుమారు 200 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. బాధితులతో కేజీహెచ్‌ నిండిపోయింది.

 

విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ సభ్యులకు రాష్ట్రపతి సానుభూతి ప్రకటించారు. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఇలాంటి దుర్గటన జరగడం ఎంతో విషాదం అని ఆయన అన్నారు.   అందరి క్షేమం కోరుతూ, బాధితులు త్వరగా కోలుకోవాలని పేర్కొంటూ భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు రామ్‌నాథ్‌ కోవింద్‌ తెలిపారు.  

 

మరోవైపు విశాఖ గ్యాస్‌ లీక్‌ విషాదం గురించి వినడం చాలా బాధగా ఉందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్ట సమయంలో అందరి శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ఇక తెంగాణ సీఎం కేసీఆర్ సైతం ఈ విషాద సంఘటన గురించి తెలిసిన తర్వాత ఎంతో బాధ అనిపించిందని.. వారందరికీ తన సానుభూతి ప్రకటించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: