
తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని కలిసిన తర్వాత కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ఒక మాట అన్నారు. ముఖ్యమంత్రిగా జగన్ ఉన్నంతకాలం తననెవరూ ఏమీ చేయలేరన్నారు. అంటే మంత్రి ఏదైనా దౌర్జన్యం చేసినా, అక్రమాలకు పాల్పడినా, అరాచకాలకు పాల్పడినా, అవినీతికి పాల్పడినా ముఖ్యమంత్రి అండ తనకు ఉంటుందని చెప్పారా? లేదంటే తాను ఎటువంటి అక్రమాలకు పాల్పడటంలేదు.. కాబట్టి జగన్ తనకు మద్దతుగా నిలుస్తున్నారని చెబుతున్నారా? ఈ రెండింటిలో ప్రజలు ఏది అర్థం చేసుకోవాలో విజ్ఞులైన మంత్రివర్యులవారికే తెలియాలి. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిని కలవడానికి కారణం.. తన నియోజకవర్గ పరిధిలో తన అనుచరుల ట్రాక్టర్లను ఎస్ ఐ పట్టుకుంటే ఆయనతో ఫోన్ సంభాషణ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దీనిపై వివరణ ఇవ్వడానికి ఆయన జగన్ ను కలిశారు. దీనిపై ఆయన జయరాంకు చీవాట్లు పెట్టారా? పొగిడారా? నువ్వు చేసిన పని శభాష్ అన్నారా? అనేది మంత్రివర్యులకే తెలియాలి. బయటకు వచ్చిన తర్వాత ఆయన చెప్పిన మాట మాత్రం అది. దాదాగిరి చేయను.. దందాలు చేయను అని మంత్రి స్పష్టం చేస్తున్నారు. చెప్పీ చెప్పకనే ఆయన మాటల్లో దాదాగిరి మాత్రం కనపడుతోంది.