ఏపీలో ఇటీవల కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని అమలు చేసిన సంగతి తెలిసిందే. ఈ స్కీమ్‌ కింద పాఠశాలకు వెళ్లే ప్రతి విద్యార్థికి రూ. 13000 అందజేసింది. రాష్ట్రవ్యాప్తంగా తల్లికి వందనం పథకం ద్వారా 67 లక్షల మంది విద్యార్థులు సాయం పొందారు. అయితే తల్లికి వందనం డబ్బులను మద్యానికి తగిలేశాడని భర్తకు ఓ భార్య ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. అన్నమయ్య జిల్లా రెడ్డిగానిపల్లె గ్రామంలో వంకోళ్ల చంద్రశేఖర్ భవన నిర్మాణ కార్మికుడిగా జీవనం సాగిస్తున్నాడు. అతనికి 20 ఏళ్ల క్రితం రమాదేవి అనే మహిళతో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె సంతానం.


అయితే చంద్రశేఖర్ మద్యానికి బానిసై గత కొన్నేళ్ల‌ నుంచి కుటుంబాన్ని పట్టించుకోవడం మానేశాడు. దాంతో రమాదేవి పాలెంకొండకు చెందిన వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అలాగే కూలి ప‌నులు చేసుకుంటూ పిల్ల‌ల‌ను పోషిస్తోంది. ఇక ఇటీవల కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం నిధులను విడుదల చేయడంతో రమాదేవి పిల్లలిద్దరికీ డబ్బులు జమ అయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న చంద్రశేఖర్ ఏటీఎం ద్వారా బ్యాంకు ఖాతా నుండి డబ్బు మొత్తం తీసుకుని మద్యానికి తగిలేసాడు. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన రమాదేవి.. ఈనెల 2వ‌ రాత్రి 11 గంటల సమయంలో చంద్రశేఖర్ తాగే మద్యంలో విషం కలిపేసింది. అది తెలియని చంద్రశేఖర్ మద్యాన్ని తాగేశాడు.


ఆ తర్వాత భర్త గొంతు నులిమి కర్రతో కొట్టడంతో చంద్రశేఖర్ కింద పడిపోయాడు. ఉదయానికి విష ప్రభావం కారణంగా రక్తం క‌క్కుకుని మృతి చెందాడు. అయితే రమాదేవి తనకేమీ తెలియనట్టు రక్తం మ‌ర‌క‌లు శుభ్రం చేసి కూలి పనికి వెళ్ళిపోయింది. మధ్యాహ్నం ఇంటికి వచ్చాక భర్త మద్యం తాగి చనిపోయాడంటూ అంద‌ర్నీ  నమ్మించింది. అయితే చంద్రశేఖర్ శరీరంపై గాయాలను గమనించిన సోదరుడు మహేష్ అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు.. బాడీని పోస్టుమార్టంకు పంప‌గా గొంతు నులమడం, విషం కలపడం వల్ల చంద్రశేఖర్ చనిపోయినట్టు తేలింది. దీంతో రమాదేవిని గట్టిగా విచారించగా ఆమె నిజాన్ని అంగీకరించింది. ఇక నిందితురాలని పోలీసుల అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: