విచిత్రంగా ఉంది చంద్రబాబునాయుడు, నారా లోకేష్ వ్యవహారం. గ్రేటర్ హైదరాబాద్  మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసి) ఎన్నికల ప్రాచారం మంచి జోరుమీదుంది. 150 డివిజన్లలో టీడీపీ తరపున 104 మంది అభ్యర్ధులు పోటీ చేస్తున్నారు. ఒకవైపు బీజేపీ మరోవైపు టీఆర్ఎస్ ఇంకోవైపు ఎంఐఎం పార్టీల తరపున నేతలు, అభ్యర్ధులు ప్రచారాన్ని హోరెత్తించేస్తున్నారు. కావాలనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఒకేసారి ఇటు టీఆర్ఎస్ అధినేత కేసీయార్ తో పాటు కేటీయార్, అటు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీలను వాయించేస్తున్నారు. కావాలనే ఒకేసారి ముగ్గురు  నేతలను కెలికేస్తున్నారు. దాంతో ప్రచారం అన్నీ హద్దులను దాటేసి నేతలు ఒకరిని మరొకరు వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకునే స్ధాయికి చేరుకుంది. ప్రచారం పేరుతో పై పార్టీల మధ్య ఇంత రచ్చ రచ్చ జరుగుతున్నా టీడీపీ తరపున ప్రచారం చేస్తున్న వాళ్ళు కానీ పార్టీ అధినేత చంద్రబాబు కానీ పోనీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గొంతు కానీ ఎక్కడా వినబడటం లేదు. అభ్యర్ధులకు బీఫారంలు ఇచ్చాం, నామినేషన్లు వేస్తున్నారని, మ్యానిఫెస్టో విడుదల చేసినట్లు ప్రెస్  రిలీజ్ ఇచ్చుకోవటం తప్ప ఇతరత్రా ఇంకే విధంగా కూడా పార్టీలో సందడి కనబడటం లేదు.




కరోనా వైరస్ పేరుతో గడచిన ఎనిమిది మాసాలుగా చంద్రబాబు, లోకేష్ హైదరాబాద్ లోనే ఉండిపోయారు. ఎప్పుడైనా అత్యవసరం అయితే తప్ప అమరావతికి వెళ్ళటం లేదు. హైదరాబాద్ లోనే ఉన్న చంద్రబాబు అభ్యర్ధుల ప్రచారానికి ఎందుకు బయట తిరగటం లేదన్నదే అందరికీ ఆశ్చర్యంగా ఉంది. పై పార్టీలను వదిలేస్తే కాంగ్రెస్ నేతలు కూడా అక్కడక్కడ కనబడుతునే ఉన్నారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి రోడ్డుషోలతో జనాలను ఆకట్టుకుంటున్నాడు. రెగ్యులర్ గా ప్రతిరోజు ఎన్నో కొన్ని డివిజన్లలో  ప్రచారం చేస్తున్నాడు. చివరకు వామపక్షాల అభ్యర్ధులు కూడా తమ ప్రచారంతో హోరెత్తించేస్తున్నారు. మరి పార్టీలన్నీ తమ అధ్యక్షులను , కీలక నేతలను ప్రచారంలో దింపేసిన విషయం చూసిన తర్వాత కూడా చంద్రబాబు, లోకేష్ ఎందుకు ఇంట్లో నుండి కాలు బయటకు పెట్టడం లేదు ? అన్నదే పెద్ద ప్రశ్నగా మారింది. అభ్యర్ధుల ఎంపిక, వారికి బీఫారాలు జారీ చేయటం వరకే తమ బాధ్యతగా డిసైడ్ అయిపోయినట్లున్నారు అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.




టీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీయార్ కు భయపడే తండ్రి, కొడుకులు ఇంట్లో నుండి బయటకు రావటం లేదనే ప్రచారం పెరిగిపోతోంది. ఎందుకంటే టీడీపీ తరపున ప్రచారానికి వస్తే ఎవరిని టార్గెట్ చేసుకోవాలి ? అన్నదే అసలైన సమస్య. కేసీయార్ ను టార్గెట్ చేస్తే మళ్ళీ హైదరాబాద్ రోడ్లపై తిరుగలేరనే భయం. పోనీ బీజేపీని టార్గెట్ చేద్దామంటే అదీ కుదరదు. ఎందుకంటే ఏపిలో  కమలంపార్టీతో పొత్తుకు నానా అవస్తలు పడుతున్నారు. కాబట్టి తెలంగాణాలో బీజేపీ పై ఆరోపణలు, విమర్శలు చేస్తే దాని ఎఫెక్ట్ ఏపిలో కనబడుతుందనే టెన్షన్. ఇక కాంగ్రెస్ పైన మాట్లాడాలంటే ఇక్కడే మాట్లాడేందుకు ఏమీ లేదు. ఎందకంటే మొన్నటి వరకు హస్తం పార్టీతోనే పొత్తలు పెట్టుకున్నారు. ఇక మిగిలింది ఎంఐఎం మాత్రమే. ఓల్డ్ సిటీకి మాత్రమే పరిమితమైన పార్టీని టార్గెట్ చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే. పోనీ వామపక్షాలను టార్గెట్ చేద్దామంటే సీపీఐ ఏపిలో టీడీపీకి మిత్రపక్షంగా మారిపోయింది. కాబట్టి దీన్ని టార్గెట్ చేసినా లాభం లేదు. చివరకు మిగిలింది ఒక్క సీపీఎం మాత్రమే. దీన్ని టార్గెట్ చేస్తే ఎంత ? చేయకపోతే ఎంత ? హోలు మొత్తం మీద అర్ధమైపోయిందేమంటే కేసీయార్ కు భయపడే చంద్రబాబు ప్రచారానికి కూడా అడుగు బయటపెట్టలేదని. ఇలా ఎంతకాలం ఇంట్లోనే కూర్చుంటారో ఏమో.

మరింత సమాచారం తెలుసుకోండి: