ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో జగన్, చంద్రబాబు జోరు పెంచుతున్నారు. ప్రజాగళం పేరుతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇవాళ్టి నుంచి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోనున్నారు. ఇప్పటికే బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ.. రా కదలి రా పేరిట రోడ్‌షోలు, బహిరంగ సభలు నిర్వహించిన చంద్రబాబు ఇవాళ్టి నుంచి మలివిడత ప్రచారం ప్రారంభించనున్నారు.


చంద్రబాబు తొలిరోజు పలమనేరుతో పాటు పుత్తూరు, మదనపల్లెల్లో పర్యటిస్తారు.  కుప్పం నుంచి నేరుగా పలమనేరు చేరుకోనున్న చంద్రబాబు..తొలి బహిరంగ సభలో మాట్లాడుతారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన పుత్తూరు చేరుకుని రోడ్‌షో, బహిరంగసభకు హాజరవుతారు. పుత్తూరు నుంచి హెలికాప్టర్‌లో మదనపల్లె చేరుకుంటారు. అక్కడ బహిరంగసభలో ప్రసంగిస్తారు.ప్రజాగళం తొలివిడత షెడ్యూల్ ఈనెల 31 వరకు సిద్ధం చేశారు. 28న రాప్తాడు, శింగనమల, కదిరి, 29న శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలు, 30న మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తిలో ప్రచారాన్ని నిర్వహిస్తారు.


31న కావలి, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలులో పర్యటిస్తారు. ఇప్పటికే సూపర్ సిక్స్ మినీ మేనిఫెస్టో పథకాలకు అదనంగా, ఫించన్ 4వేలు రూపాయలు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన 60రోజుల్లోనే మెగా డీఎస్సీ దస్త్రం పై సంతకం చేస్తానన్నారు. తాజా ప్రజాగళం సభల్లోనూ మరిన్ని హామీలు ఇచ్చే  అవకాశం ఉంది.


ఇక సీఎం జగన్‌ కూడా డోస్‌ పెంచనున్నారు. ఇన్నాళ్లూ సిద్దం సభలు నిర్వహించిన జగన్ ఇవ్వాళ్టి నుంచి.. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో జనం బాట పట్టారు. గతంలో పాదయాత్ర చేసిన ఆయన ఇప్పుడు బస్సు యాత్ర చేయబోతున్నారు. ఇవాళ జగన్ ఇడుపులపాయ నుంచి బస్సుయాత్ర చేపట్టనున్నారు. తొలి మూడు రోజుల్లో 300 కిలోమీటర్లకు పైగా జగన్ యాత్ర నిర్వహించనున్నారు. రాత్రిళ్లు మార్గ మధ్యంలోనే జగన్ బస చేయనున్నారు. మరి జగన్, చంద్రబాబు ఇద్దరు అగ్ర నేతల ప్రచారం ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి. ఎన్నికల సమయం దగ్గరకి వస్తున్నందున ఇక మాటల యుద్ధం మరింతగా ముదిరే అవకాశం ఉంది. హామీల వర్షం కూడా కురిసే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: