రాజకీయాల్లో అధికార పార్టీల్లోకి ప్రతిపక్ష ఎమ్మెల్యేల జంపింగ్ సర్వ సాధారణంగానే జరుగుతుంది. పైకి నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారుతున్నామని చెబుతారు గానీ..దాదాపు అందరు అధికారం కోసమే పార్టీలు మారతారు. అలాగే ప్రతిపక్షాలని దెబ్బకొట్టాలని చెప్పి..అధికార పార్టీ కూడా వలసలని ప్రోత్సహిస్తుంది. అలా తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ వలసలని ప్రోత్సహిస్తూనే ఉంది. అలాగే ప్రతిపక్షాల ఎమ్మెల్యేలు అధికారం కోసం టీఆర్ఎస్‌లోకి వచ్చేశారు.

అలా గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు, టీడీపీ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరారు. అలా జంప్ చేసిన ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరాక కాస్త ప్రజలకు అండగా ఉండాలి. కానీ అధికార బలంతో సొంత ప్రయోజనాలనే చూసుకుంటే..అలాంటి ఎమ్మెల్యేలని ప్రజలు మళ్ళీ ఆదరించే పరిస్తితి ఉండదు. అలా ఇప్పుడు జంపింగ్ ఎమ్మెల్యేలు కాస్త ఇబ్బందులు పడుతున్నట్లు కనిపిస్తోంది.

ఉమ్మడి ఖమ్మం జిల్లా పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావుది కూడా అదే పరిస్తితి. 2009 ఎన్నికల్లో ఈయన కాంగ్రెస్ నుంచి పోటీ చేసి పినపాక ఎమ్మెల్యేగా గెలిచారు. మళ్ళీ 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇలా కాంగ్రెస్ నుంచి గెలిచిన కాంతారావు..ఆ తర్వాత టీఆర్ఎస్‌లోకి జంప్ చేసేశారు. టీఆర్ఎస్‌లోకి వచ్చాక పినపాకలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. పినపాకలో సి‌సి రోడ్లు, వంతెనలు, వాటర్ ట్యాంకులు, అండర్ డ్రైనేజ్ నిర్మాణాలు జరిగాయి. నియోజకవర్గంలో పలు సమస్యలు కూడా ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా పోడు భూముల సమస్యలు ఎక్కువగా ఉన్నాయి.

రాజకీయంగా చూస్తే రేగా కాస్త స్ట్రాంగ్‌గానే ఉన్నారు...కానీ టీఆర్ఎస్‌లో ఆధిపత్య పోరు ఉంది. ఇక్కడ టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కూడా దూకుడుగా పనిచేస్తున్నారు. 2014లో వైసీపీ నుంచి గెలిచిన ఆయన తర్వాత టీఆర్ఎస్‌లోకి వచ్చారు. ఇక 2018లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. రేగా టీఆర్ఎస్‌లోకి వచ్చిన సరే, నెక్స్ట్ టీఆర్ఎస్ సీటు దక్కించుకోవాలని చూస్తున్నారు. ఈ ఆధిపత్య పోరే రేగా కొంపముంచేలా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: