సోనూసూద్ మరోసారి మానవత్వం చాటుకున్నారు. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు, పేద కుటుంబాలకు ఆర్థికసాయం చేస్తూ వార్తల్లో నిలిచారు. ఇబ్బందుల్లో ఉన్నాం ఆదుకోండని తన దగ్గరికి వచ్చివారికి ఆర్థికసాయం చేస్తున్నారు. కేవలం ఒక రాష్ట్రానికే పరిమితం కాకుండా దేశం నలుమూలల ఆయన చేస్తున్న సేవలు విస్తరించాయి.

తాజాగా శ్వాసకోశ సమస్యతో బాధ పడుతున్న ఓ బాలుడికి ఆర్థిక సాయం చేసేందుకు సోనూసూద్ ముందుకు వచ్చారు. బాలుడికి సాయం చేయనున్నట్లు తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేశారు. అనారోగ్యంతో బాధ పడుతున్న ఆ బాలుడిని ముంబయిలోని ఎస్ఆర్ సీసీ ఆస్పత్రిలో జాయిన్ చేయిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వారం రోజుల్లోగా బాలుడికి ఆపరేషన్ జరుగుతుందని, బాలుడు త్వరగా కోలుకుంటాడని.. తల్లిదండ్రులు ఆందోళనకు గురికావొద్దని భరోసా కల్పించారు.



ఐదు రోజుల కిందట ఓ తల్లి తన కొడుకు ఆరోగ్య పరిస్థితి గురించి సోనూసూద్ కు ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఈ మేరకు స్పందించిన సోనూసూద్ బాలుడికి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించనున్నట్లు ప్రకటించారు. సోనూ స్పందించి మానవత్వం చాటుకోవడంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆయన చేసిన సేవలకు సలాం కొడుతున్నారు.

స్నేహల్ మిసల్ అనే మహిళ అక్టోబర్ 25వ తేదీన తన కొడుకు గుండె సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నాడని, ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలని వైద్యులు సూచించారని, ఆర్థికంగా ఆదుకోవాలని సోనూసూద్ ను వేడుకున్నారు. ఈ మేరకు స్పందించిన సోనూసూద్ ఆమెకు భరోసా కల్పించారు. కాగా, ఇప్పటికే చాలా మందికి సాయం చేస్తూ సోనూసూద్ వార్తల్లోకి ఎక్కారు. సినిమాల ద్వారా సంపాదించిన డబ్బుతో పాటు బిజినెస్ ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా ప్రజల కష్టాలు తీర్చేందుకు వాడుతున్నారు. రాజకీయ నాయకులు, బిజినెస్ మెన్లు, స్టార్ హీరోలు చేయలేని పనిని సోనూసూద్ చేస్తున్నారు.  దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును.. మంచి క్రేజ్ ను దక్కించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: