అక్టోబర్ 1991 వ సంవత్సరంలో విడుదలైన క్షణ క్షణం సినిమా భారీ హిట్ అయ్యింది. అప్పటికే శివ సినిమా తో బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న రామ్ గోపాల్ వర్మ  క్షణ క్షణం సినిమా తో స్టార్ డైరెక్టర్ గా మారిపోయారు. శివ సినిమా తీసిన తర్వాత ఖాళీగా ఉన్న రామ్ గోపాల్ వర్మ వద్దకు నిర్మాతలైన డాక్టర్ కెఎల్ నారాయణ, లక్ష్మణ్ చౌదరి కలిసి వెళ్లారు. తమ దగ్గర వెంకటేష్, శ్రీదేవి డేట్స్ ఉన్నాయని చెప్పడం తో రామ్ గోపాల్ వర్మ ఎగిరి గంతేశారు. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ శ్రీదేవిని యుక్త వయసు నుంచే ఆరాధించేవారు. అయితే ఆమెతో సినిమా అనగానే ఆయన ఎంతో ఆనందం వ్యక్తం చేసి వెంటనే సినిమా ప్రారంభించడానికి రెడీ అయ్యారు. అయితే తన దగ్గర రెడీగా ఉన్న ఒక సినిమా కథను వినిపించగానే నిర్మాతలు ఓకే చెప్పి శ్రీ దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై సినిమాను ప్రారంభించారు.

అయితే ఈ సినిమాకి 24, 361 లేదా 24, 48 ఇలా ఏదో ఒక నెంబర్ ని టైటిల్ గా పెట్టాలనుకున్నారు. కానీ చివరికి క్షణక్షణం అనే పేరుని ఖరారు చేశారు. ప్రతినాయకుడిగా పరేష్ రావేల్ ని తీసుకున్నారు. ఈ సినిమాలోని ఆయన పాత్రకు ఆయనే డబ్బింగ్ చెప్పుకున్నారు. 50 రోజుల్లోనే సినిమా పూర్తి కావాల్సి ఉంది కానీ శ్రీదేవి తండ్రి పోవడంతో ఆమె చాలా రోజుల వరకు షూటింగ్ లో పాల్గొనలేదు. దీంతో సినిమా షూటింగ్ పూర్తయ్యే సరికి 18 నెలల సమయం పట్టింది. ఈ సినిమా రూ.1 కోటి 50 లక్షల బడ్జెట్ తో పూర్తయింది.

క్షణ క్షణం మూవీ తో బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా రామ్ గోపాల్ వర్మ 2 నంది అవార్డులు అందుకున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన శ్రీదేవి కి ఉత్తమ నటీమణిగా నంది అవార్డు లభించింది. ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎం ఎం కీరవాణి కి సౌత్ ఫిలిం ఫేర్ అవార్డు దక్కింది. దీన్ని బట్టి ఈ సినిమా ఎంత అద్భుతంగా తెరకెక్కిందో అర్థం చేసుకోవచ్చు.

ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన జామురాతిరి జాబిలమ్మ పాటను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర ఎంతో మధురంగా పాడారు. కీరవాణి స్వరపరిచిన ఈ పాట ఎవర్ గ్రీన్ హిట్ గా నిలుస్తోంది. ఈ సినిమాలో 'జంబారే' పాట తప్ప మిగిలిన పాటలన్నీ సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: