
తాజాగా ఈ సినిమా పేరు వివాదాల్లో ఇరుక్కుంది. చక్రవర్తి పృథ్వీరాజ్ చౌహాన్ జీవిత కథ ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఆదిత్య చోప్రా తన నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ టైటిల్‌పై కర్ణి సేనా సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సినిమా పేరును వెంటనే మార్చాలని కర్ణి సేనా యూత్ వింగ్ ప్రెసిడెంట్, చిత్ర నిర్మాత సుర్జీత్ సింగ్ రాథోర్ డిమాండ్ చేశారు. ఈ సినిమాకు పెడితే చక్రవర్తి పూర్తి పేరు ‘పృథ్విరాజ్ చౌహాన్’ అని పేరును మార్చాలని ఆయన అన్నారు. అలా కాకుండా ఈ విధంగా సగం పేరును పెట్టడం ఆయన ప్రతిష్టకు భంగం కలిగించడమే అని ఆయన చెప్పారు. ఒకవేళ తమ డిమాండ్‌లను తిరస్కరిస్తే గతంలో సంజయ్ లీలా భన్సాలీ ‘పద్మావత్’ సినిమా ఎదుర్కొన్న పరిణామాలనే మీరు కూడా చూడాల్సి వస్తుందని హెచ్చరించారు.
అంతేకాకుండా ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్న అక్షయ్ కుమార్‌ను తాము గౌరవిస్తున్నామని, అయితే ఈ చిత్ర నిర్మాత ఆదిత్య ప్రజల మనోభావాలను అర్థం చేసుకోవాలని ఆశిస్తున్నామన్నారు. చివరి హిందూ సామ్రాట్ యోధుడైన పృథ్వీరాజ్ చౌహాన్ పూర్తి పేరు మీ మూవీకి పెట్టాలని, అంతేకాకుండా ఇందులో ఆయన గొప్పతనం ప్రతిబింబించాలని, ఒకవేళ అలా లేకుంటే పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టి ఆందోళన చేస్తామని అన్నారు. మరి ఈ విషయంలో చిత్ర యూనిట్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.