
వెండి తెర పై వెలుగు రేఖలా మెరిసిన కళాభినేత్రి ఆమె, ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిన మొదటి రంగుల రాణి ఆమె, చిన్న కవ్వింపుతోనే అనేక భావాలు పుట్టించగలిగే అందాల నటీమణి ఆమె, సినీ జగతిలో ఆమె ప్రయాణం మరచిపోలేని ఓ మధుర జ్ఞాపకం, ఇప్పటికీ ఎప్పటికీ తెలుగు సినీ ప్రపంచానికి ఆమె గొప్ప నవలా నాయికే, ఆమె వాణిశ్రీ.
అప్పుడే స్టార్ గా ఎదిగింది వాణిశ్రీ. మరో సావిత్రి అవుతుంది అన్నారు. కానీ, సావిత్రి ప్రభావం తనమీద పడకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది వాణిశ్రీ. తనకంటూ ఒక ప్రత్యేక శైలిని అలవరుచుకుంటూ 'మహా కళాభినేత్రి వాణిశ్రీ అయింది'. పల్లెటూరి పొగరుబోతు పాత్ర, మధ్యతరగతి అమాయిక యువతి పాత్ర వరకు ఆమె రూపం ఆ పాత్రలకు ప్రతిరూపం అయింది.
రూపలాణ్యాలున్న కథానాయకగా ఆ రోజుల్లో వాణిశ్రీ స్థాయి.. తారాస్థాయిలో ఉన్నప్పటికీ.. నటనా రంగానికి స్వస్తి చెప్పి సంసార జీవితాన్ని స్వీకరించింది. ఒక కొడుకు, ఒక కూతురు పుట్టాక, 80వ దశకంలో మళ్ళీ తల్లి, అత్త పాత్రలతో పునః ప్రవేశించింది. అలాగే బుల్లితెర పై ప్రేమనగర్ అంటూ టీవీ ప్రేక్షకులను కూడా అలరించింది.
వాణిశ్రీ ఆగస్టు 3, 1948 నెల్లూరులో వెంకమ్మ, రాఘవయ్యల దంపతులకు పుట్టింది. ఆ రోజుల్లో మెట్రిక్యులేషన్ చదువుకుంది. ఆలాగే సంగీతం, భరతనాట్యం కూడా నేర్చుకుంది. తిరుగులేని సినీ మహారాణిలా ఒక వెలుగు వెలిగింది. అయినా తన అక్క, బావ చేతిలో తీవ్రమైన నమ్మక ద్రోహానికి గురి అయింది. వాణిశ్రీ ఆస్తిపాస్తులన్నీ వాళ్ళు హస్తగతం చేసుకున్నారు. అయినా మళ్ళీ నిలబడగలిగిన ధైర్యవంతురాలు వాణిశ్రీ.