నాగ చైతన్య ప్రస్తుతం తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. అసలే నాగ చైతన్య థాంక్యూ ఫ్లాపుతో సతమతమవుతున్నాడు.
అంతకు ముందు లవ్ స్టోరీ, బంగార్రాజు వంటి చిత్రాలతో సక్సెస్ కొట్టేశాడు. కానీ ఎంతో అంచనాలతో వచ్చిన థాంక్యూ మాత్రం దెబ్బేసింది. ఇప్పుడు తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో కూడా సినిమా చేస్తున్నాడు. అయితే ఇప్పుడు వెంకట్ ప్రభు యూనిట్‌కు పెద్ద దెబ్బ తగిలినట్టు కనిపిస్తోంది.
NC 22 మూవీ షూటింగ్ కర్ణాటకలోని మాండ్య జిల్లాలోని మేల్కోటీ గ్రామంలో జరుగుతుందట.. అక్కడ సెట్ వేసి సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇలా షూటింగ్ చేయటంపై అక్కడున్న గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్ర యూనిట్ సెట్ వేసి షూటింగ్ చేస్తున్న ప్రాంతం పక్కనే రాయ గోపుర దేవాలయం ఉందట.. అక్కడ నిత్యం పూజలు జరుగుతుంటాయి. ఆ దేవాలయం ముందు బార్ సెటప్ గట్రా వేసి డాన్సులు చేస్తూ అపవిత్రం చేయడమేంటని గ్రామస్థులకు కోపం వచ్చిందట.. దీంతో చిత్రయూనిట్ మీద గ్రామస్థులు దాడి చేసినట్టు తెలుస్తోంది.
అయితే ఈ మేరకు పోలీసుల నుంచి పర్మిషన్ తీసుకున్నా.. ఇలాంటి సన్నివేశాలు షూట్ చేస్తామని చెప్పలేదట. తాను ఇచ్చింది కూడా రెండు రోజుల పర్మిషన్ మాత్రమేనని మాండ్య డీసీ పేర్కొన్నాడు. చిత్ర యూనిట్‌పై గ్రామస్థులు దాడి చేసేటప్పుడు నాగ చైతన్య సెట్‌లోనే ఉన్నారట. గుడి సమీపంలో ఇలా బార్ సెట్ వేసినందుకు చిత్రయూనిట్‌పై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కూడా కోరుతున్నారు.
నిత్యం పూజలు జరిగే గుడి ముందు ఇలా చేయటం హిందు దేవుళ్లను అవమానించటమేనని భావించిన గ్రామస్థులు సెట్‌ను పీకేశారని కూడా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలపై చిత్ర యూనిట్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఈ సినిమాలో నాగ చైతన్యకు జోడీగా కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి