రాజకీయాలు ఎవరిని అందలం ఎక్కిస్తాయో మరెవరిని దించేస్తాయో తెలియదు. తెర మీద మహామహులమని జబ్బలు చరచుకున్న వారు ఎన్నికల్లో ఫల్టీలు కొడతారు. స్టార్లు అనుకున్న వారు అక్కడ జీరోలవుతారు. రీల్ లైఫ్ లో సైడ్ క్యారక్టర్లు వేసిన వారు రియల్ లైఫ్ లో టాప్ రేపుతారు. ఇపుడు అటువంటిదే జరిగింది.
అప్పట్లో అంటే 2007 టైంలో రాజమౌళి డైరెక్షన్లో జూనియర్ కాంబోలో వచ్చిన యమదొంగ సినిమాలో నటించిన నవనీత్ కౌర్ ఇప్పుడు మహారాష్ట్రలో ఎమ్.పి అయ్యారు. యమదొంగ, శ్రీను వాసంతి లక్ష్మీ, మహారథి వంటి చిత్రాల్లో నటించిన నవనీత్ కౌర్ తాజాగా మహారాష్ట్రలోని అమరావతి లోక్సభ నియోజకర్గంలో గెలిచారు. శివసేన సిటింగ్ ఎంపీ ఆనంద్రావ్పై యువ స్వాభిమానీ పక్ష తరఫున పోటీ చేసిన కౌర్ 30 వేల మెజారిటీతో గెలిచారు.
బాలీవుడ్లోనూ అద్భుత నటనతో అలరించిన ఆమె మహారాష్ట్ర ఎమ్మెల్యే రవి రాణాను పెళ్లి చేసుకున్నారు. భర్త అడుగుజాడల్లో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆమె తాజా ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందారు. ఇది నిజంగా గొప్ప విషయమే. ఆమె తెలుగులో చేసిన సినిమాలలో యమదొంగ తప్ప ఎవీ హిట్లు కాదు కదా చెప్పుకునేందుకు కూడా లేవు. అయినా ఆమె ఈ రోజు పార్లమెంట్ మెంబర్, మరి బాలీవుడ్ ఆమెను ఆదరించింది. అక్కడ ప్రజలూ దీవిందారనుకోవాలి.