సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ భారీ అంచనాల నడుమ బుధవారం నాడు థియేటర్స్లో సందడి చేస్తుంది. అయితే ఇప్పటి వరకు ఈ చిత్రంలో నటించిన నటీనటుల ఫోటోలు..క్యారెక్టర్స్ కి సంబంధించిన వీడియోలు రివీల్ చేశారు..కానీ అక్కినేని నాగేశ్వరరావు పాత్రకు సంబంధించినది మాత్రం చేయలేదు. మొదటి నుంచి ఈ క్యారెక్టర్ పై ఎంతో కుతూహలం నెలకొంది..అయితే ఈ పాత్రలో నాగ చైతన్య నటిస్తున్న విషయం తెలిసిందే..కానీ ఎలా ఉండబోతున్నారన్న విషయం మాత్రం కాస్త గోప్యంగా ఉంచారు.
ఈ చిత్రంలో కీలక పాత్రలకు మహామహుల్ని ఎంపిక చేసుకున్న సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ లీడ్లో నటిస్తున్న ఈ మూవీలో ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్, జెమినీ గణేశన్, కెవి రెడ్డి, కెవి చౌదరి పాత్రల కోసం నటీనటులను ఎంపిక చేశారు. అయితే సావిత్రి జీవితంలో ఎన్టీఆర్, ఏఎన్నార్ పాత్రలు చాలా కీలకం. ఆమె ఈ ఇద్దరు హీరోలతో ఎక్కువ సినిమాలు చేయడం వల్ల ఆమె జీవితంతో కీలకపరిణామాలు ఈ హీరోలతో ముడిపడి ఉన్నాయనేది అందరికీ తెలిసిన విషయమే.
ఇక ఏఎన్నార్ పాత్రలో నటించిన నాగచైతన్య లుక్ ఒకటి బయటకు వచ్చింది. ఈ లుక్లో తాతకు తగ్గ మనువడులా పాతతరం ఏఎన్నాఆర్లా సన్నని మీసకట్టుతో పర్ఫెక్ట్గా సూటయ్యాడు నాగ చైతన్య. నాలుగైదు కీలక సన్నివేశాల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించాడు నాగచైతన్య. అయితే నాగేశ్వరరావు లుక్ లో నాగార్జున కూడా ఇంత పర్ఫెక్ట్ గా సూట్ కాడేమో అని అక్కినేని అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.