జనసేనపై కుట్ర జరుగుతోందా? ఈ ఎన్నికల తర్వాత ఆ పార్టీకి గుర్తింపు ఉండదా? ప్రస్తుతం ఏపీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. 2014 ఎన్నికలకు ముందు జనసేన ఆవిర్భవించింది. ఈ ఎన్నికల్లో పార్టీ పోటీ చేయలేదు. టీడీపీ, బీజేపీలకు మద్దతు ప్రకటించింది. గత ఎన్నికల్లో మాత్రం వామపక్షాలతో కలిసి బరిలోకి దిగింది. కానీ కేవలం ఒక్క చోట మాత్రమే విజయం సాధించింది. రెండు చోట్ల పోటీ చేసిన పవన్ ఓడిపోయారు.


కేవలం 5.5శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. దాని ఫలితంగానే జనసేన గాజు గ్లాసు గుర్తు ప్రమాదంలో పడింది. ఎన్నికల నిబంధనల మేరకు.. గాజు గుర్తు కామన్ సింబల్ జాబితాలో చేరిపోయింది. ప్రస్తుతం జనసేన పొత్తులో భాగంగా 21 అసెంబ్లీ, రెండు ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తోంది. మచిలీ పట్నం, కాకినాడ పార్లమెంట్ స్థానాలతో పాటు 21 అసెంబ్లీ సీట్లలో మాత్రమే జనసేన అభ్యర్థులకు ఈసీ గాజు గ్లాస్ గుర్తును కేటాయించింది.


మిగతా చోట్ల స్వతంత్రులకు ఇవ్వడంతో వివాదం మొదలైంది. ఇది కూటమి గెలుపుపై ప్రభావం చూపనుంది. అందుకే ఇండిపెండెట్లకు ఈ గుర్తును కేటాయించొద్దని ఆ మూడు పార్టీలు ఎలక్షన్ కమిషన్ కు నివేదించాయి. ఇదిలా ఉండగా ఈ ఎన్నికల్లో జనసేన సాధించే ఓట్ల శాతం బట్టి ఆ పార్టీ మనుగడ ఆధారపడి ఉంటుంది. ఈసీ నిబంధనల ప్రకారం.. ఆరు శాతం ఓట్లు వస్తేనే జనసేనకు గుర్తింపు ఉంటుంది. లేకుంటే గాజు గ్లాస్ గుర్తు ప్రమాదంలో పడ్డట్టే. దీంతో పాటు పార్టీ గుర్తింపు రద్దయ్యే అవకాశం ఉంది.


ఈ సమయంలో 21 అసెంబ్లీ సీట్లలో 50శాతానికి పైగా ఓట్లను జనసేన అభ్యర్థులు సాధించాలి. ఇది సాధ్యమా అంటే.. గతంలో టీడీపీ గెలవని సీట్లను జనసేనకు కేటాయించారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ లెక్కన మెజార్టీ స్థానాల్లో ఆ పార్టీ గెలుపు ప్రశ్నార్థకమే. వచ్చే ఎన్నికల్లో జనసేన ఉండకూడదు అనే ఉద్దేశంతో చంద్రబాబు ఈ కుట్ర పన్నారని.. అందుకే తక్కువ సీట్లు కేటాయించారని పలువురు ఆరోపిస్తున్నారు. మరి ఈ కుట్రను జనసేనాని గుర్తించారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: