గత ఎన్నికలలో వైయస్ జగన్‌కు పూర్తిగా మద్దతు తెలిపింది. వైయస్ ఫ్యామిలీ.. తల్లి వై.ఎస్.విజయలక్ష్మి తో పాటు చెల్లి షర్మిల, అటు బాబాయ్ ఫ్యామిలీ ఇలా వైఎస్ ఫ్యామిలీ అంతా ఏకతాటి మీద జగన్ ముఖ్యమంత్రిని చేసేందుకు ఎంతో కష్టపడింది. కట్ చేస్తే ఇప్పుడు తల్లి జగన్ కు దూరం దూరంగా ఉంటుంది. చెల్లి షర్మిల ఏకంగా ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉండి.. అన్న మీదే పోరాటం చేస్తుంది. ఈ క్రమంలోనే తమ ఫ్యామిలీ కంచుకోట ఆయినా కడప నుంచి కాంగ్రెస్ తరపున పార్లమెంటుకు పోటీ చేస్తుంది.


కొద్ది రోజుల క్రితం జగన్ తన ప్రచారంలో కడపలో షర్మిలకు డిపాజిట్లు రావని విమర్శించారు. అవినాష్ రెడ్డి ఎలాంటి తప్పు చేయలేదని తాను నమ్మటం వల్లే ఆయనకు ఎంపీ సీటు ఇచ్చారని ప్రకటించారు.
ఇక టీడీపీ నుంచి జమ్మలమడుగు టీడీపీ ఇన్చార్జిగా ఉన్న భూపేష్ రెడ్డికి అనుహ్యంగా కడప పార్లమెంటు సీటు ఇచ్చారు చంద్రబాబు. టీడీపీని పక్కన పెడితే కడప పార్లమెంటులో వైసీపీ అభిమానులు, వైయస్ అభిమానులు ఆ కుటుంబాన్ని బాగా అభిమానించే ఎస్సీ, ఎస్టి, ముస్లిం మైనార్టీ వర్గాల ఓట్లు ఎటువైపు ?పడతాయి.. షర్మిల ప్రభావం ఎంతవరకు ఉంటుంది.. అన్న చర్చ కూడా ఉంది.


జగన్ పై అభిమానం అలాగే ఉన్నా.. దేశవ్యాప్తంగా మోడీపై తీవ్ర వ్యతిరేకతతో కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉంటున్నారు ముస్లింలు. ఈ ప్రభావం కడప పార్లమెంటులో కొంతవరకు పడుతుందన్న చర్చ కూడా నడుస్తోంది. పైగా కడప పార్లమెంటుకు కాంగ్రెస్ నుంచి తమ అభిమాన నాయకుడు రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల పోటీలో ఉన్నారు. నిన్న మొన్నటి వరకు ముస్లింలలో మెజార్టీ వర్గాలు ఎమ్మెల్యే ఓటు వైసీపీకి వేసినా పార్లమెంటుకు కాంగ్రెస్‌కు వేయాలని ఎక్కువగా చర్చించుకున్న పరిస్థితి.


అయితే ఇప్పుడు ఒక ఓటు వైసీపీకి ఇంకో ఓటు కాంగ్రెస్‌కు వేయటం కన్నా రెండు ఓట్లు కాంగ్రెస్‌కు వేస్తే ఎలా ఉంటుందన్న చర్చలు కూడా గ్రౌండ్ లెవెల్ లో బాగా వినిపిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక పార్లమెంటు వ్యాప్తంగా ఉన్న ఎస్సీ వర్గాల్లోనూ కొందరు షర్మిలకు ఎంపీ ఓటు వేయాలన్న ఆలోచన ఎక్కువగా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ పోరులో షర్మిలకు జగన్ చెప్పినట్లు నిజంగానే డిపాజిట్లు రావా..? లేదా షర్మిల బలంగా ఓట్లు చీల్చి కడపలో తన సత్తా ఏంటో చాటుకుంటుందా..? అన్నది చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: