అప్పట్లో సంచలనం సృష్టించిన ఓటు కు నోటు కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ప్రస్తుతం తెలంగాణ , ఏపీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ కేసు తెరపైకి రావడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ఓటు కు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉన్నారు.


అయితే తెలంగాణ కు సీఎం గా రేవంత్ రెడ్డి ఉన్నందున ఈ కేసును వేరే ప్రాంతానికి బదిలీ చేయాలంటూ పిటిషన్ దాఖలు అయింది. బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఈ పిటిషన్ వేశారు.  దీనిపై న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సతీశ్ చంద్రశర్మ, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఈ కేసు విచారణ తెలంగాణలో కాకుండా మధ్యప్రదేశ్ లో జరిగేలా బదిలీ చేయాలని పలువురు పిటిషన్లు దాఖలు చేశారు.


అయితే ఈ కేసు విచారణను సుప్రీం కోర్టు వాయిదా వేసింది. తదుపరి విచారణను జులైలో నిర్వహిస్తామని ధర్మాసనం తెలిపింది. ఓటుకు నోటు కేసు విచారణను మధ్యప్రదేశ్ కు బదిలీ చేయాలని పిటిషన్ పై కౌంటర్ ను సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం ఫైల్ చేయలేదు. గత విచారణ సందర్భంగా రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం, ప్రతివాదులకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంతో విచారణ వాయిదా పడింది.


ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబుకి సీఎం రేవంత్ రెడ్డి మేలు చేసేలా వ్యవహరించారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేసును బదిలీ చేయాలనే పిటిషన్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం, సీఎం  రేవంత్ రెడ్డి కౌంటర్ దాఖలు చేయకపోవడంతో విచారణ వాయిదా పడింది. ఇంతలోపు ఎన్నికలు ముగుస్తాయి. ఒకవేళ చంద్రబాబు అధికారంలోకి  వస్తే.. ఏపీలో చంద్రబాబు.. తెలంగాణలో రేవంత్ రెడ్డిలు సీఎంలుగా ఉంటారు కాబట్టి కేసు మరుగున పడే అవకాశం ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: