- ప‌ల్నాడు జిల్లాలో ఓ వైసీసీ సీనియ‌ర్ ఎమ్మెల్యే తెర‌చాటు రాజ‌కీయం
- చంద్ర‌బాబు, టీడీపీని తిట్టినా లావును పన్నెత్తు మాట అన‌ని వైనం
- అనిల్ మీద కోపంతోనే లావుకు స‌పోర్ట్ అంటూ లోక‌ల్‌గా గుస‌గుస‌లు..?


( ప‌ల్నాడు - ఇండియా హెరాల్డ్ )

ఒక పార్టీ నుంచి పోటీ చేస్తున్న నేతలు.. ఒక ఓటు నాకు, మరొక ఓటు వేరే పార్టీకి వేయమని చెప్పటం లేదా.. ఒక ఓటు నాకు, రెండవ ఓటు మీకు నచ్చిన వాళ్లకు వేసుకోమని చెప్పటం పచ్చి అవకాశవాద రాజకీయాలకు నిదర్శనం. ఇది గత కొన్నేళ్ల నుంచి నడుస్తోంది. ఉదాహరణకు 2004లో టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా బీజేపీ నుంచి నరసాపురం ఎంపీగా పోటీ చేసిన దివంగత కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు.. నాడు కాంగ్రెస్ నుంచి నరసాపురం అసెంబ్లీకి పోటీ చేసిన ముదునూరు ప్రసాదరాజు పరస్పరం సహకరించుకున్నారని.. అలాగే కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన హరిరామ జోగయ్య నరసాపురం అసెంబ్లీకి టీడీపీ నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు సహకరించుకున్నారన్న చర్చ నడిచింది. ఇక్కడ పార్టీలు వేరే వేరు అయినా.. కృష్ణంరాజు, ప్రసాదరాజు ఇద్దరు క్షత్రియులు. అటు సుబ్బారాయుడు, హరి రామజోగ‌య్య ఇద్దరు కాపు వర్గానికి చెందినవారు.


ఇక ఇప్పుడు పల్నాడు జిల్లాలో వైసీపీ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్న ఆ పార్టీ సీనియర్ నేత సిట్టింగ్ ఎమ్మెల్యే ఒకరు. అసెంబ్లీకి నాకు ఓటు వేసి.. పార్లమెంటుకు టీడీపీ నుంచి పోటీ చేస్తున్న లావు శ్రీకృష్ణదేవరాయలకు ఓటు వేయాలని ఇంటర్నల్ గా తమ పార్టీ నేతలతోనే చెబుతున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ ఇంటర్నల్ గా నడుస్తున్న మరో చర్చ ఏమిటంటే.. సదరు సీనియర్ నేతకు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు అంత సఖ్యత లేదని తెలుస్తోంది. వారిద్దరి మధ్య మంత్రి పదవి విషయంలో రెండేళ్ళ‌ క్రితమే చిచ్చు రేగిందని.. అప్పట్నుంచి ఎడ‌మొఖం, పెడముఖంగా ఉంటున్నారని వైసీపీలోనే ప్రచారం ఉంది.


దీనికి తోడు లావు శ్రీకృష్ణదేవరాయలు నిన్నటి వరకు వైసీపీలోనే ఉన్నారు. ఆయనకు నరసరావుపేట పార్లమెంటు పరిధిలోని వైసీపీ ఎమ్మెల్యేలు అందరితోనూ మంచి సంబంధాలే ఉన్నాయి. పైగా 2019 ఎన్నికలలో వారికి భారీగా ఆర్థిక లబ్ది కలిగేలా చేశారు. ఇటు లావుతో ఉన్న సన్నిహిత సంబంధాలు.. అటు అనిల్ కుమార్ యాదవ్ తో ఉన్న గ్యాప్ నేపథ్యంలో.. ఆ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అసెంబ్లీకి తనకు ఓటు వేసి.. ఎంపీకి టీడీపీకి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ చేస్తున్నారని.. ఈ ప్రచారం వల్ల టీడీపీ సానుభూతిపరులలో కూడా కొన్ని ఓట్లు తన సొంతం చేసుకోవాలన్న ప్లాన్ తో ఉన్నారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: