ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల రాజకీయం కీలక అంకానికి చేరుకుంది. మరో వారంలోనే ఎన్నికల యుద్ధం జరగబోతోంది. మే13న పోలింగ్‌ అయినా.. మే 11 సాయంత్రం నాటికి ప్రచారం పూర్తి చేయాల్సి ఉంటుంది. అంటే సరిగ్గా వారం రోజుల సమయం మాత్రమే ఉందన్నమాట. అందుకే ఇన్నాళ్లూ ఒక ఎత్తు.. ఇకపై ఒక్కో రోజూ ఒక ఎత్తుగా చెప్పుకోవచ్చు. అభ్యర్థుల ఎంపికలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఎంత బాగా ప్రచారం చేసుకున్నా.. ఎన్ని వ్యూహాలు అమలు చేసినా.. చివరి రోజుల్లో ఎలక్షనీరింగ్‌ అనేదే గెలుపు ఓటములను ప్రభావితం చేస్తుంది.


అందులోనూ ఇప్పుడు ఏపీలో ఎన్నికల టగ్‌ ఆఫ్‌ వార్‌గా సాగుతున్నాయి. ఏ పార్టీ వైపు పూర్తిగా గాలి కనిపించడం లేదు. వేవ్‌ అన్నది లేదు. ఎవరికి వారే తమదే గెలుపని ధీమా వ్యక్తం చేస్తున్నా గుండెల్లో గుబులు రేగుతూనే ఉంది. అందుకే ఇప్పుడు చివరి వారంలో శక్తి యుక్తులన్నీ కూడదీసుకుని కొత్త వ్యూహాలు రచిస్తున్నాయి పార్టీలు.


కూటమి విషయానికి వస్తే.. జగన్‌ సర్కారు ఇస్తున్న పథకాలను కొనసాగిస్తూనే అంతకు మించి సాయం చేస్తామని ముందుకు వచ్చింది. సూపర్‌ సిక్స్, షణ్ముఖ వ్యూహం అంటూ పదుల కొద్దీ పథకాలు ప్రకటించింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నో ఆకర్షణీయమైన హామీలు వండి వార్చింది. దీనికి తోడు వైసీపీ మేనిఫెస్టో అంతగా ఆకర్షణీయంగా లేకపోవడంతో తమ మేనిఫెస్టో సూపర్‌ హిట్‌ అని ఆనందంలో తేలియాడుతోంది. అయితే ఎన్నికల హామీల అమలు విషయంలో చంద్రబాబుకు పెద్దగా విశ్వసనీయత లేకపోవడం మైనస్ పాయింట్‌గా మారింది.


అందుకే కొత్తగా ల్యాండ్ టైట్లింగ్‌ యాక్ట్‌పై రచ్చ షురూ చేసింది. ఈ చట్టంతో జగన్ మీ భూములన్నీ కొట్టేస్తాడని ప్రచారం ప్రారంభించింది. ఇక జగన్ మాత్రం పూర్తిగా తన పథకాలనే నమ్ముకున్నాడని చెప్పాలి. చంద్రబాబు వందలకొద్దీ హామీలు ఇచ్చినా.. వాటిని జనం నమ్మరన్న ధీమాలో ఉన్నారు. అందుకే చంద్రబాబు పాత మేనిఫెస్టోను బయటకు తెచ్చి.. ఆయన ఎన్ని హామీలు ఎగ్గొట్టాడో గుర్తు చేస్తున్నాడు. అంతే కాదు.. ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తానంటున్న మోడీ మాటలను కూడా అస్త్రాలుగా వాడుతున్నారు. మొత్తానికి ఇక వారం రోజులే మిగిలి ఉండటంతో పార్టీలు తమ చిట్టచివరి అస్త్రాలను బయటకు తీస్తున్నాయి. ఇక ఈ వారం రోజులు రాజకీయం మరింత రంజుగా మారడం ఖాయం.


మరింత సమాచారం తెలుసుకోండి: