- ఏలూరు పార్ల‌మెంటు బ‌రిలో పుట్టా త‌న‌యుడు మ‌హేష్ యాద‌వ్‌
- వైసీపీ బీసీ యాద‌వ అస్త్రంపై సేమ్ అస్త్రం వాడిన బాబు
- సునీల్ యాద‌వ్ Vs మ‌హేష్ యాద‌వ్ పోరుతో వేడెక్కిన ఏలూరు పార్ల‌మెంటు

( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ )

గోదావరి జిల్లాలోని ఏలూరు పార్లమెంటు సీటు.. లోకల్ వర్సెస్ నాన్ లోకల్ నేతల పోరుకు వేదికగా మారింది. ఇక్కడి నుంచి వైసీపీ తరఫున మంత్రిగా ఉన్న కారుమూరు నాగేశ్వరరావు తనయుడు కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి రాయలసీమ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన పుట్టా మహేష్ కుమార్ యాదవ్ పోటీ చేస్తున్నారు. మహేష్ కుమార్ ఇటు టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడికి స్వయానా అల్లుడు. అటు టీటీడీ మాజీ చైర్మన్ మైదుకూరులో టీడీపీ నుంచి పోటీ చేస్తున్న సుధాకర్ యాదవ్ కు తనయుడు కావడం విశేషం. వాస్తవంగా చూస్తే ఈ సీటును ఏలూరు పార్లమెంటు లోక‌ల్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త గోరుముచ్చు గోపాల్ యాదవ్ ఆశించారు. చివరి క్షణంలో చంద్రబాబు గోపాల్‌ను కాదని రాయలసీమ జిల్లాల నుంచి మహేష్ యాదవ్‌ను ఇక్కడకు దిగుమతి చేయటం.. పార్టీ వర్గాల్లో చాలామందికి నచ్చలేదు.


దీంతో గోపాల్ యాదవ్ పార్టీ మారిపోయారు. మహేష్ కు సీటు ఇచ్చినప్పుడు పార్లమెంటు పరిధిలోని టీడీపీలో చాలా అలజడి రేగింది. ఏలూరు పార్లమెంటు పరిధిలో పోలవరం, ఉంగుటూరు స్థానాలు జనసేనకు ఇవ్వడం.. కైకలూరు బీజేపీకి ఇవ్వడం పార్టీ కీలక నేత చింతమనేని ప్రభాకర్‌కు దెందులూరు లో చివర వరకు బీఫామ్ ఇవ్వకపోవడంతో.. మహేష్ యాదవ్ అసలు నామినేషన్ వేస్తారా.. అన్న సందేహం నుంచి ఈరోజు మహేష్, సునీల్ మధ్య హారాహోరీ పోరు అనేంతవరకు పరిస్థితి వచ్చేసింది. మహేష్‌కు సీటు ఇచ్చినప్పుడు లోకల్, నాన్‌లోకల్ అంశం ప్రజల్లో గట్టిగా చర్చ‌కి వచ్చింది. ఆ తర్వాత అది క్రమక్రమంగా తెరమరుగవుతుంది.


యనమల రామకృష్ణుడు కు సుదీర్ఘకాలంగా ఈ ప్రాంతం టీడీపీ నేతలతో ఉన్న పరిచయాలు.. యాదవ సంఘాలలో ఆయనకు ఉన్న పట్టు నేపథ్యంలో నాన్ లోకల్ అంశాన్ని కొంతవరకు తెరమరుగు చేసినా ఇంకా అది కొందరిలో ఉందనే చెప్పాలి. టీడీపీ వీరాభిమానులు టీడీపీ కార్యకర్తలు మహేష్ యాదవ్ కు అభిమానం కొద్ది ఓటు వేసినా.. న్యూట్రల్ జనాల్లో ఎక్కడో రాయలసీమ వాడు కదా అన్న సందేహం అయితే కొంతవరకు ఉంది. ఇక సునీల్ కుమార్ యాదవ్ కూడా ఏలూరు పార్లమెంటుకు నాన్ లోకల్ వ్యక్తి అయితే.. సమీపంలోని తణుకు నియోజకవర్గానికి చెందిన వాడు కావడం.. గతంలో ఇదే పార్లమెంటులోని దెందులూరు నుంచి సునీల్ తండ్రి కారుమూరు నాగేశ్వరరావు వైసీపీ నుంచి పోటీ చేయటం... ఆయన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జడ్పీ చైర్మన్‌గా పనిచేయటం.. ఇవన్నీ సునీల్ కు కలిసి రానున్నాయి.


ఓవరాల్‌గా స్వాతంత్య్రానంతరం ఏలూరు పార్లమెంటు సీటుపై రెండు ప్రధాన పార్టీల నుంచి బీసీలకు చెందిన వారు పోటీ పడటం.. అందులోను ఇద్దరూ యాదవ సామాజిక వర్గానికి చెందిన యువకులు కావడంతో పోరు అయితే మంచి రసవత్తరంగా ఉందనే చెప్పాలి. సునీల్ కు గతంలో తన తండ్రి గెలుపు కోసం దెందులూరు లో ప్రచారం చేసిన అనుభవం కలిసి వస్తోంది. అటు మహేష్ యాదవ్ కు టీడీపీ  క్యాడర్ తో పాటు ఆర్థికంగా బలంగా ఉండటం ప్లస్ కానుంది. మరి ఈ ఇద్దరు యువ నేతల పోరులో అంతిమ సమరంలో ఎవరు విజయం సాధిస్తారో ? చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: