- నెల్లూరు పార్ల‌మెంటులో వైసీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థుల ప్ర‌చారం ఇది
- వేమిరెడ్డికి సొంత ఇమేజ్‌కు తోడవుతోన్న వైసీపీ క్యాండెట్ల సైలెంట్ ప్ర‌చారం
- విజ‌య‌సాయిని బ‌లి ప‌శువును చేసిన‌ట్టేనా ?


( నెల్లూరు - ఇండియా హెరాల్డ్ )

నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలో అధికార వైసీపీలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. పార్లమెంటు పరిధిలో అసెంబ్లీకి పోటీ చేస్తున్న కొందరు ఎమ్మెల్యేలు చేస్తున్న ప్రచారం.. ఇక్కడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఉన్న విజయ్ సాయి రెడ్డిని ఎన్నికలకు ముందే ఓడించేలా కనిపిస్తోంది. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులలో మెజారిటీ అసెంబ్లీకి మాకు ఓటు వేయండి.. పార్లమెంటుకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఓటు వేయమని కొందరు చెబుతుంటే.. మరికొందరు మీకు ఇష్టం వచ్చిన వారికి వేసుకోమని పరోక్షంగా వేమిరెడ్డికి సపోర్ట్ చేయాలని చెబుతున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి వైసీపీలో కీలక నేతగా ఉండడంతో పాటు.. నెల్లూరు పార్లమెంటు పరిధిలో చాలామంది వైసీపీ నాయకులకు ప్రభాకర్ రెడ్డి ఆర్థిక సాయం చేశారు.


జగన్ సైతం ముందుగానే వేమిరెడ్డికి నెల్లూరు పార్లమెంటు సీటు ఇచ్చారు. ఇక్కడ జగన్, ప్రభాకర్ మధ్య ఏర్పడిన వివాదం నేపథ్యంలో ప్రభాకర్ రెడ్డి పార్టీ నుంచి బయటికి రావడంతో పాటు.. టీడీపీలోకి వెళ్లి ఆ పార్టీ నుంచి నెల్లూరు పార్లమెంటుకు పోటీ చేస్తున్నారు. ప్రభాకర్ రెడ్డి భార్య ప్రశాంతి రెడ్డి సైతం నెల్లూరు పార్లమెంటు పరిధిలోని కోవూరు నుంచి అసెంబ్లీకి పోటీ పడుతున్నారు. విజయ్ సాయి రెడ్డి ఎంత రాజ్యసభ సభ్యుడు అయినా.. లోకల్ గా ప్రభాకర్ రెడ్డికి మంచి పట్టు ఉంది. పైగా ఆయన వివాద రహితుడు. వైసీపీ నేతలు సైతం ప్రభాకర్ రెడ్డిని గట్టిగా విమర్శించే పరిస్థితి లేదు. అలా చేస్తే ఓట్లు పోతాయి అన్న భయం కూడా అక్కడ అసెంబ్లీకి పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ఉంది.


పైగా ఇప్పుడు వైసీపీ నుంచి ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్న వారిలో చాలామంది ప్రభాకర్ రెడ్డి దగ్గర ఆర్థికంగా భారీగా సాయం పొందిన వారే. అందుకే వారంతా ఆయన రుణం ఇలా తీర్చుకుంటున్నారు అన్న ప్రచారం కూడా జరుగుతుంది. పైగా రెండు ఓట్లు అడిగితే కొంతమంది న్యూట్రల్ జనాలు తమకు ఓటు కూడా వేసే పరిస్థితి లేదన్న నిర్ణయానికి వచ్చిన అసెంబ్లీ అభ్యర్థులు.. అసెంబ్లీ వరకు ఫ్యాన్ సింబల్ పై తమకు ఓటెయ్యాలని.. పార్లమెంటుకు వచ్చేసరికి సైకిల్ కు వేయమని చెబుతున్న పరిస్థితి. కొందరు అయితే ఇన్ డైరెక్ట్ గా ప్రభాకర్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారు. ఏది ఏమైనా నెల్లూరు పార్లమెంటు పరిధిలో వైసీపీ నేతలు చేస్తోన్న ఈ డబుల్ రాజకీయం దెబ్బకు అక్కడ ఎంపీగా పోటీ చేస్తున్న విజయ్ సాయి రెడ్డికి కష్టంగా మారిందని చెప్పాలి

మరింత సమాచారం తెలుసుకోండి: