ఎనిమిదేళ్ల క్రితం వచ్చిన రోబో సినిమా ఒక్కసారి గుర్తు చేసుకోండి. అందులో హీరో రజినీకాంత్ రెండు పాత్రల్లో కనిపిస్తారు. సైంటిస్ట్ వశీకర్ గానూ.. రోబోగానూ రజినీకాంత్ నటించారు. అంటే డ్యూయల్ రోల్ అన్నమాట. కానీ రోబో సీక్వెల్ గా తీసిన 2.Oలో శంకర్ ఇంకో మ్యాజిక్ చేసారు. అక్కడే ఉంది అసలు ట్విస్టు.
అంతే కాదు.. ఈ ట్విస్టును శంకర్ సినిమా రిలీజ్ వరకూ రివీల్ చేయకపోవడం కూడా రజినీకాంత్ అభిమానులకు షాకే. అందుకే 2.0 చూసేందుకు ఆసక్తిగా వచ్చిన రజినీ అభిమానులు... ఆ తర్వాత తెరపై వచ్చిన రజినీపాత్రలను చూసి షాకయ్యారు. వశీకర్ గానూ... రోబో 2.0గానూ రజినీ నటిస్తారని ఆయన అభిమానులు ఊహించిందే. కానీ అంతకు మించి తెరపై రజినీ సందడి చేసారు.
వశీకర్ పాత్ర, చిట్టి, బ్యాడ్ చిట్టిగా రోబో 2.0 పాత్రల్లోనే కాకుండా రోబో 3.0 పాత్రలోనూ రజినీకాంత్ కనిపిస్తారు. అంతే కాదు.. ఈ పాత్ర మరుగుజ్జు రోబోగా ఉండటం మరో కొసమెరుపు. ఈ రోబో 3.0 పాత్ర గురించి సినిమా చూసేవరకూ ఎవరికీ తెలియదు. అంత పకడ్బందీగా శంకర్ గోప్యతను మెయింటైన్ చేయడం నిజంగా అబ్బురమే.
ఓవైపు నాలుగు పాత్రల్లో రజినీకాంత్ విజృంభణ, మరోవైపు పక్షిరాజుగా అక్షయ్ కుమార్ వీరవిహారం, మనసులను కదిలించే కథ, హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా శంకర్ సృష్టించిన విజువల్ వండర్.. ఇలా 2.0 సినిమాకు వెళ్లిన రజినీఅభిమానులకే కాకుండా సాధారణ ప్రేక్షకులకు కూడా కనువిందు కలిగింది.