ఓ చిన్న పొరపాటు వల్ల న్యూజిలాండ్‌లోని భారతీయుడికి భారీ షాక్ తగిలింది. తాను చేయని తప్పుకి అతడు కోట్ల రూపాయల నష్ట పరిహారం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. పూర్తి వివరాలు తెలుసుకుంటే.. ఎన్నారై దీపక్ లాల్ దక్షిణ ఆక్లాండ్‌లోని పాపాకురాలో మంచి ఇల్లు కట్టుకోవాలని చాలాకాలంగా కలలు కంటున్నారు. అయితే ఇంటి నిర్మాణానికి సరిపడా నగదు జమ చేసిన అనంతరం ఆయన పినాకిల్ హోమ్స్ అనే కంపెనీ సహాయంతో తన ఇంటి నిర్మాణ కార్యక్రమాలు చేపట్టారు.


కొద్ది నెలల సమయంలో ఆయన ఇంటి కల నెరవేరింది. అయితే ఎంతో కాలంగా చెమటోడ్చి సంపాదించిన డబ్బుతో తనకిష్టమైన ఇల్లు కట్టుకున్నానని దీపక్ లాల్‌ చాలా సంతోషించారు కానీ ఆయన ఆనందం క్షణాల్లో ఆవిరైంది. దీపక్ లాల్‌ కట్టుకున్న ఇంటి పక్కన ఒక ఖాళీ స్థలం ఉంది. ఆ ఖాళీ స్థలం సీ94 డెవలప్‌మెంట్ కంపెనీకి చెందినది. అయితే దీపక్ లాల్‌ తన ఇంటి నిర్మాణ పనులు పూర్తి చేసిన వెంటనే సీ94 డెవలప్‌మెంట్ కంపెనీ నోటీసులు పంపించింది.



'మీ ఇల్లు మా ఖాళీ స్థలంలోకి వచ్చింది. మీ ఇల్లును కనీసం ఒక మీటరు దూరం పక్కకు జరపండి లేదా నష్టపరిహారం కింద మాకు 3.15లక్షల( సుమారు కోటిన్నర రూపాయలు) న్యూజిలాండ్ డాలర్లను చెల్లించండి' అని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే సీ94 కంపెనీ పంపించిన నోటీసులు చదవగానే దీపక్ షాక్ కి గురయ్యారు. మూడు లక్షలకు పైగా డాలర్లు చెల్లించేంత స్తోమత తనకు లేదని.. బిల్డర్ చేసిన పొరపాటు వల్ల తాను భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి వచ్చిందని లబోదిబోమంటున్నారు.



అయితే అక్కడి న్యాయవాదులు మాట్లాడుతూ.. బిల్డర్ పొరపాటు చేసినా యజమాని ఒక్కరే పరిహారం చెల్లించాలని చెబుతున్నారు. అయితే దీపక్ తన ఇంటిని సీ94 కంపెనీ స్థలం నుంచి ఒక మీటర్ పక్కకి జరిపేందుకు (మన కరెన్సీలో)80 లక్షల రూపాయలు అవుతాయట. అయితే నష్టపరిహారం కంటే ఇంటిని పక్కకు షిఫ్ట్ చేయటమే కాస్త తక్కువ ఖర్చుతో కూడిన పని అని దీపక్ భావిస్తున్నారు. ఏది ఏమైనా బిల్డర్ ఇంటిని డిజైన్ చేస్తున్న సమయంలోనే దీపక్ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈరోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: