కాళేశ్వరం ప్రాజెక్టుపై శ్వేత పత్రం విడుదల చేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.  కొత్తగూడెంలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ సెక్రటేరియట్ మూసేసి ఫామ్ హౌస్ లో పడుకుని కాళేశ్వరం రీ డిజైనింగ్ పేరుతో వేల కోట్ల రూపాయల దోపిడీ చేశారని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ప్రజలకు వాస్తవ విషయాలు తెలియాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రైతుల కోసం పుట్టింది కాదని.. కేసీఆర్ దోపిడీ ఆలోచన నుంచి పుట్టిందని భట్టి ఆరోపించారు. కేవలం రూ. 28 వేల కోట్లతో పూర్తయ్యే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును రీ డిజైనింగ్ పేరుతో.. రూ. 80 వేల కోట్లకు పెంచి వేల కోట్ల రూపాయలను దోపిడీ చేశారని అన్నారు. అంతేకాక ప్రతి ఆరు నెలలకోసారి అంచనాలు పెంచి రూ. లక్షా 15 వేల కోట్లకు పెంచారని భట్టి తీవ్రస్థాయిలో విమర్శించారు. అంచనాలు పెంచిన సొమ్మంతా దోపిడీకి గురవుతోంది తప్ప.. రైతులకు, వ్యవసాయ భూములకు ఎక్కడా ఉపయోగపడడం లేదని నిప్పులు చెరిగారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించి దాదాపు మూడు సంవత్సరాలు పూర్తవుతోందని రోజుకు రెండు టీఎంసీల నీటిని లిఫ్ట్ చేస్తామని చెప్పిన కేసీఆర్.. ఇప్పటివరకూ.. ఎన్ని వందల టీఎంసీలు నీరు ఎత్తిపోశారో, ఎన్ని ఎకరాలకు సాగునీరు అందించారో ప్రజలకు చెప్పాలని భట్టి డిమాండ్ చేశారు. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు గురించి నీటి ఎత్తిపోతలు, నిర్మాణ, విద్యుత్ ఖర్చుల వివరాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని అన్నారు.  రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టి తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వహిస్తోందని భట్టి ఆగ్రహంగా చెప్పారు.  బడ్జెట్ సమావేశాల్లో కాళేశ్వరం డీపీఆర్ ఇవ్వాలని అడిగినా.. ఇప్పటివరకూ బయట పెట్టలేదని భట్టి చెప్పారు. దీనివెనుక.. పెద్ద మతలబు.. దోపిడీ ఉందని ఆరోపించారు.

కేసీఆర్ చేసిన రూ. 6 లక్షల కోట్ల అప్పును.. తెలంగాణ ప్రజలు కొన్ని దశాబ్దాల పాటు మోయాల్సి ఉంటుందని భట్టి చెప్పారు. ఈ భారం మోయలేక రాష్ట్ర ప్రజల నడ్డి విరుగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రజలు 2023లో కేసీఆర్ కు బడితపూజ చేసి వదిలించుకుంటారని భట్టి జోస్యం చెప్పారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని, కేసీఆర్ అరెస్టు ఖాయమని బీజేపీ నాయకులు ప్రగల్భాలు పలికారు తప్ప అవినీతిని వెలికితీసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని భట్టి అన్నారు. బీజేపీ-టీఆర్ఎస్ పార్టీలు డ్రామాలాడుతున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రాజెక్టు వ్యయం ఎంత? ప్రస్తుత వ్యయం ఎంత ఉన్నదో ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బండి సంజయ్ ది కాకిగోల తప్ప మరేం లేదని మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: