ప్రకాశం జిల్లాలో రాజకీయాలు ఎప్పుడు ఒకేలా ఉండవు...జిల్లా మొత్తం ఒకే పార్టీకి అనుకూలంగా ఉన్నట్లు కనిపించదు. జిల్లాలో కొంత భాగం ఒక పార్టీకి, మరో భాగం ఇంకో పార్టీకి అనుకూలంగా ఉన్నట్లు ఉంటుంది. గత రెండు ఎన్నికల్లోనూ అదే పరిస్తితి కనిపించింది. 2014లో జిల్లాలో 12 సీట్లు ఉంటే వైసీపీకి 6, టీడీపీకి 5, ఇండిపెండెంట్ ఒక సీటు గెలుచుకున్నారు. 2019లో వైసీపీకి కాస్త అనుకూలంగానే ఉన్నా సరే టీడీపీ కూడా పర్వాలేదనిపించింది.

వైసీపీ 8 సీట్లు, టీడీపీ 4 సీట్లు గెలుచుకుంది. అయితే ఇప్పుడు జిల్లా రాజకీయాలు మరింత వేగంగా మారుతున్నాయి. జిల్లాలో వైసీపీకి వ్యతిరేకంగా రాజకీయం ముందుకెళుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో వైసీపీపై వ్యతిరేకత కనిపిస్తోంది. ఈ క్రమంలోనే దర్శి-కనిగిరి నియోజకవర్గాల్లో ఫ్యాన్ పార్టీకి రివర్స్ అవుతుంది. 2014 ఎన్నికల్లో ఈ రెండు సీట్లు టీడీపీ ఖాతాలో పడ్డాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ ఖాతాలో పడ్డాయి. మళ్ళీ 2024 ఎన్నికల్లో సీన్ మారేలా ఉంది.

రెండుచోట్ల టీడీపీకి అనుకూలంగా రాజకీయం మారుతుంది. ఇప్పటికే దర్శిలో వైసీపీపై ఎంత వ్యతిరేకత వచ్చిందో ఇటీవల మున్సిపాలిటీ ఎన్నికలు నిరూపించాయి. అసలు దర్శి టీడీపీలో బలమైన నేతలు లేకపోయినా సరే, మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. అటు వైసీపీలో ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు, మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావులు ఉన్నారు.

అయినా సరే దర్శి మున్సిపాలిటీలో వైసీపీ గెలవలేదు. అలాగే నియోజకవర్గ స్థాయిలో కూడా వైసీపీపై వ్యతిరేకత వచ్చినట్లు కనిపిస్తోంది. దీంతో నెక్స్ట్ ఎన్నికల్లో దర్శిలో వైసీపీ గెలుపు అంత ఈజీ అయ్యేలా లేదు. అటు కనిగిరిలో ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ పరిస్తితి కూడా అంత మెరుగ్గా లేదు. ఇక్కడ టీడీపీ నేత ముక్కు ఉగ్రనరసింహ రెడ్డి పుంజుకున్నారు. మొత్తానికైతే ఈ సారి దర్శి-కనిగిరి స్థానాల్లో ఫ్యాన్ రివర్స్ అయ్యేలా ఉంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: