భీమవరంలో పర్యటిస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి చంద్రబాబు పై ఆగ్రహం వ్యక్తంచేశారు. జాబు రావాలి అంటే బాబు రావాలి అన్న చంద్రబాబు  అధికారంలోకి వచ్చాక కొత్త ఉద్యోగాలు సంగతి పక్కన పెడితే ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టారని ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్ మండిపడ్డారు. 

దేశంలోని ఏ రాష్ట్రంలోనూ జరగని స్థాయిలో ఏపీలో అవినీతి జరిగిందని ఆరోపించారు. పెందుర్తి, శృంగవరపుకోట, పెద్దాపురం, భీమవరంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక రైతుల గురించి మాట్లాడుతూ, రైతులకు 12 గంటల విద్యుత్ ను అందిస్తామని చెప్పి మాట తప్పారంటూ జగన్ నిలదీశారు. దేశంలోనే అత్యంత పేదవాడు ఎవరంటే మన రైతేనని నాబార్డ్‌నివేదికలు చెబుతున్నాయి అంటూ బాబు పై మండిపడ్డారు. ఆ రైతులను చంద్రబాబు ప్రభుత్వం గాలికి వదిలేసిందని జగన్ ఆరోపించారు. 

గత ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన 650 వాగ్దానాలను నెరవేర్చలేదని తాజాగా మరోసారి హామీలు గుప్పిస్తున్నారని మండిపడ్డారు. చెప్పిందేదీ చంద్రబాబు చేయరన్నారు. రైతు రుణమాఫీ కనీసం వడ్డీలు కట్టేందుకు కూడా సరిపోలేదని, డ్వాక్రా రుణాల వడ్డీలు సైతం భారీగా పెరిగాయని విమర్శించారు. ఈ ఎన్నికల్లో వైకాపా అధికారంలోకి వస్తే రైతులు, డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు ఇస్తానని హామీ ఇచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: