మహాకవి తిక్కన నడయాడిన ప్రదేశమయిన నెల్లూరులో ప్రాచీన తెలుగు భాషా అధ్యయన కేంద్రం ఏర్పాటు కానుంది. ఇందు కోసం గత రెండు సంవత్సరాలుగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేసిన కృషి పలించింది. మైసూరులోని తెలుగు అధ్యయన కేంద్రాన్ని విక్రమ సింహపురి యూనివర్సిటీకి మారుస్తూ ఆదేశాలు జారీచేసింది కేంద్ర ప్రభుత్వం.
2008లో తెలుగుకు ప్రాచీన భాష హోదా వచ్చింది. 2011—12 నుంచి 2015-16 మధ్య తెలుగు భాష అభివృద్ధి, పరిరక్షణ కోసం కేంద్రం 6.9 కోట్లు కేటాయించింది. మొత్తంగా ప్రాచీన భాష పరిరక్షణకు కేంద్రం విడతల వారీగా మొత్తం 100 కోట్లు కేటాయిస్తోంది. దీనికోసం ఒక ప్రాచీన తెలుగు విశిష్ట కేంద్రం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు పంతాలకు పోయాయి. చివరకు మైసూరులో ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం ఏర్పాటైంది. దిగుమర్తి మునిరత్నం నాయుడు ఈ కేంద్రానికి తొలి సంచాలకులుగా వ్యవహరించారు.
మైసూరులో ప్రాచీన తెలుగు అద్యయన కేంద్రం ఉండటం వల్ల తెలుగు భాషాకు ఎలాంటి ఉపయోగం లేదనే విషయాన్నికవులు, చరిత్రకారులు, భాషా సాహిత్య వేత్తలు ప్రముఖుల దృష్టికి తీసుకెళ్లినా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించ లేదు. అధ్యయన కేంద్రం తరలింపును తన భుజాల మీద వేసుకున్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. పలుమార్లు కేంద్ర మానవ వనరులశాఖ అధికారులతో మాట్లాడి ఎట్టకేలకు నెల్లూరులో అధ్యయన కేంద్రము ఏర్పాటుకు మార్గం సుగమం చేసారు. ఆగస్డు 29న అధ్యయన కేంద్రాన్ని నెల్లూరుకు మారుస్తూ అదేశాలు జారీ చేసింది కేంద్రం. వచ్చే నెల రోజుల్లో ఇక్కడ నుంచి కార్యకలాపాలు మెదలు కానున్నాయి.
బెంగుళూరులోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ ఆఫీసులో క్లాసికల్ లాంగ్వేజెస్ అనే విభాగం ఉంది. అందులో తమిళం, కన్నడ, తెలుగు వంటి ప్రాచీన హోదాను సంతరించుకున్న భాషలున్నాయి. తమిళులు అక్కడి నుంచి తమ కార్యాలయాన్ని ఇప్పటికే సొంత రాష్ట్రానికి తీసుకెళ్లారు. కన్నడిగులు వేరే విశ్వవిద్యాలయానికి తమ కార్యాలయాన్ని తరలించారు. వారు ఖాళీచేసిన కార్యాలయం వేదికగానే ఇప్పటి వరకూ తెలుగు కేంద్రం పని చేస్తోంది. ఎట్టకేలకు మన తెలుగు అధ్యయన కేంద్రం నెల్లూరుకు తరలించడం పట్ల తెలుగు భాషావేత్తలు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి