ఏపీలో రైతు భరోసా పథకం అమలుకు పూర్తి స్థాయిలో సహకరిస్తామని బ్యాంకర్లు ముఖ్యమంత్రి జగన్‌కు హామీ ఇచ్చారు. సచివాలయంలో నిర్వహించిన 208వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో కీలకమైన అంశాలపై చర్చ జరిగింది. రాష్ట్రంలో ప్రతి నెలా ఓ కొత్త పథకాన్ని ప్రారంభిస్తున్నామనీ... బ్యాంకులు అన్నింటికీ సహకరించాలని కోరారు సీఎం. 


ఇచ్చిన హామీలు...చెప్పిన మాటలు నిలబెట్టుకునేలా ప్రభుత్వం ముందడుగు వేస్తోందని... సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా బ్యాంకర్లు సహకరించాలని కోరారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగింది. ప్రభుత్వం, బ్యాంకర్లు కలిసి పని చేస్తేనే వివిధ వర్గాల ప్రజలకు చేయూత అందించడం సాధ్యమవుతుందని జగన్ అన్నారు. ప్రభుత్వం వివిధ పథకాలకింద అనేకమంది లబ్దిదారులకు నగదు ఇస్తోందని.. ఆ డబ్బు నేరుగా వారికి చేరాలంటే బ్యాంకుల భాగస్వామ్యమే కీలకమన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బ్యాంకర్లు రుణ చెల్లింపుల కింద మినహాయించుకోకూడదని సీఎం జగన్ తేల్చి చెప్పారు. దీనికోసం అన్‌ఇన్‌కంబర్డ్‌ ఖాతాలు తెరవాలని సూచించారు.  


ప్రతీ నెలా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించే పథకాల అమలుకు బ్యాంకర్ల  సహకారం పూర్తిస్థాయిలో అవసరమని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. అక్టోబరు 15 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనున్న ప్రతిష్టాత్మక పథకం రైతు భరోసాకు కూడా సహకరించాలని ఆయన కోరారు. సచివాలయంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశానికి అధ్యక్షత వహించిన ముఖ్యమంత్రి  జగన్ .. ఇచ్చిన హామీలు, చెప్పిన మాటలు నిలబెట్టుకునేలా ప్రభుత్వం ముందడుగు వేస్తోందని స్పష్టం చేశారు. విశ్వసనీయతను నిలబెట్టుకునేలా ప్రభుత్వం ప్రతీ అడుగూ వేస్తోందని అన్నారు. ఈ విషయంలో బ్యాంకర్లు ఏం కోరినా చేయడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని తెలిపారు. వడ్డీలేని రుణాలకింద ఇవాల్సిన అంశంలోనూ బ్యాంకర్లకు నిర్దేశిత సమయంలోనే ప్రభుత్వం చెల్లింపులు చేస్తుందని అన్నారు. గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ప్రతీ ఇంటికీ వెళ్లి సున్నా వడ్డీ కింద చెల్లింపును రశీదు రూపంలో లబ్దిదారులకు అందిస్తారని సీఎం తెలిపారు. దీనికి సంబంధించిన జాబితాను ఇస్తే ప్రభుత్వమే చెల్లింపులు చేస్తుందని వివరించారు. 


ముద్ర పథకం రుణాల పంపిణీని విస్తృతం చేయడం పైనా బ్యాంకర్లు దృష్టి పెట్టాలన్నారు. చిన్న దుకాణాలు, తోపుడు బళ్లకింద చిరువ్యాపారాలు చేసేవారికి గుర్తింపు కార్డులు ఇస్తామని సీఎం తెలిపారు. చిరు వ్యాపారులకు ప్రోత్సాహం వల్ల మంచి ఫలితాలు ఉంటాయన్నారు. ప్రభుత్వం ప్రతీ నెలా ఓ పథకాన్ని అమలు చేస్తోందని దీనికి బ్యాంకర్ల సహాయ సహకారాలు అవసరమని సీఎం అభ్యర్ధించారు. ఎక్కడ సమస్య ఉన్నా.. ప్రభుత్వం ముందుకు వస్తుంది, వాటిని పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఖరీఫ్‌లో రుణాల పంపిణీ లక్ష్యానికి చేరువుగా ఉందని బ్యాంకు అధికారులు చెప్పడం సంతోషకరమని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ఆశిెంచినంతమేర వర్షాలు కూడా ఉండటంతో రిజర్వాయర్లలో నీరూ సమృద్ధిగానే ఉందని రబీలో రైతులకు రుణాలు ఎక్కువగా అవసరమయ్యే అవకాశముందని ఆ మేరకు బ్యాంకర్లు సర్దుబాటు చేయాలని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: