భారత్ చైనా దేశాల మధ్య సత్సంబంధాల కొరకు జరిగే అనధికారిక చర్చలకు మహాబలిపురం వేదిక కాబోతుంది. ప్రధాని మోదీ ఇప్పటికే చెన్నై చేరుకున్నారు. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మరి కాసేపట్లో చెన్నై చేరుకోనున్నారు. చెన్నై వచ్చిన నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. చెన్నై విమానాశ్రయానికి చేరుకున్న మోదీకి తమిళనాడు గవర్నర్, ముఖ్యమంత్రి ఘనస్వాగతం పలికారు. 1:30 గంటల సమయంలో జిన్ పింగ్ చెన్నై చేరుకుంటారని సమాచారం. 
 
చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కొరకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. రెండు గంటల విశ్రాంతి తరువాత సాయంత్రం 4 గంటల సమయంలో చెన్నై నుండి జిన్ పింగ్ మహాబలిపురం బయలుదేరుతారు. పోలీసులు మహాబలిపురంలో కట్టుదిట్టమైన భద్రతాఏర్పాట్లు చేశారు. చెన్నైలోని కొన్ని ప్రధాన రహదారులలో పోలీసులు పెద్ద వాహనాల రాకపోకలను ఉదయం నుండి రాత్రి వరకు నిషేధించారని సమాచారం. 
 
జిన్ పింగ్ సాయంత్రం 5 గంటల సమయంలో మహాబలిపురంలోని అర్జున తపస్సుకు చేరుకున్న తరువాత మోదీ స్వాగతం పలుకుతారు. జిన్ పింగ్ కోసం అనేక సాంస్కృతిక కార్యక్రమాలను తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. రేపు ఉదయం జిన్ పింగ్ మోదీతో చర్చలు ప్రారంభిస్తారు. పోలీసులు మోదీ, జిన్ పింగ్ ఉండే హోటళ్లకు ఏడంచెల భద్రత కల్పిస్తున్నారని తెలుస్తోంది. భారీ సంఖ్యలో పోలీసు సిబ్బంది భద్రతా ఏర్పాట్లను నిర్వహిస్తున్నారు.
 
మహాబలిపురంకు జిన్ పింగ్ ప్రయాణించే సమయంలో ఏదైనా సమస్య ఎదురైతే ప్రత్యామ్నాయ మార్గంలో కూడా అన్ని ఏర్పాట్లు చేశారని తెలుస్తోంది. పోలీసులు మహాబలిపురం తీరప్రాంతంలో గస్తీ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. సమావేశం ముగిసిగిన తరువాత ఇద్దరు నేతలు అర్జున తపస్సు మరియు ఇతర చారిత్రక కట్టడాలను సందర్శించనున్నారని తెలుస్తోంది. కశ్మీర్ అంశంలో చైనా పాక్ వైపు వెళ్లకుండా ఈ చర్చలు ఉపకరిస్తాయని తెలుస్తోంది. ఈ సమావేశంతో ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొనే అవకాశం ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: