బుల్‌బుల్ తుఫాన్ ప్రభావంతో అతలాకుతలమైన పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలు గాడిన పడుతున్నాయి. కానీ రెండు రాష్ట్రాల్లో తీవ్ర నష్టం మిగిల్చింది. ప్రాణనష్టంతో పాటు భారీ ఆస్తినష్టం కలిగించింది. బెంగాల్‌, ఒడిషాలో 25 మందికి పైగా చనిపోయారు. తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.


ఎక్కడ చూసినా విరగిపడ్డ చెట్లు..! పైకప్పులు కొట్టుకుపోయిన ఇళ్లే కనిపిస్తున్నాయి. ఊరు ఏరు ఏకమైంది.. జనవాసాలన్నీ చెరవులను తలపిస్తున్నాయి. బుల్‌ బుల్‌ తుఫాన్‌ తీరం దాటి మూడ్రోజులు గడుస్తున్నా... బెంగాల్ మాత్రం ఇంకా తేరుకోలేదు. ఆ భీకర గాలివాన దెబ్బకు... జనజీవనం అస్తవ్యస్తమైంది. కోల్‌కతాతో సహా కోస్టల్‌ ప్రాంతాలు చాలా వరకు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా సౌత్‌ బెంగాల్‌పై తుఫాన్‌ తీవ్ర ప్రభావం చూపించింది. కరెంట్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో రెండురోజులుగా విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. బాధితులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.


60 వేల ఇళ్లకు పైగా దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. 4.5లక్షల మందిపై బుల్ బుల్ తుఫాన్ ప్రభావం చూపినట్లు చెబుతున్నారు. ముందస్తు జాగ్రత్తగా లక్షన్నర మంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బంగాళాఖాతంలో చేపలవేటకు వెళ్లి 8 మంది జాలర్లు గల్లంతయ్యారు. వారి ఆచూకీ ఇంకా లభించలేదు. పదుల సంఖ్యలో చనిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. బెంగాల్‌లోని తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నష్టంపై వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. చనిపోయిన కుటుంబాలకు రెండు లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది బెంగాల్‌ ప్రభుత్వం. 


ఒడిశాలోనూ తీవ్ర నష్టం మిగిల్చింది తుఫాన్‌. ఉద్యాన పంటలు పూర్తిగా దెబ్బతిన్నది. మూడు లక్షల హెక్టార్లలో పంట పొలాలు దెబ్బతిన్నట్లు అక్కడి ప్రభుత్వం అంచనా వేస్తోంది. ముఖ్యంగా జగత్సింగాపూర్‌, కేంద్రాపూర్‌, బాలాషోర్‌, మయూర్‌బంజ్, భద్రక్‌పై తీవ్ర ప్రభావం చూపింది. వర్షాలు తగ్గడంతో రిలీఫ్ కేంద్రాల నుంచి ఇంటికి చేరుకుంటున్నారు బాధితులు. దెబ్బతిన్న విద్యుత్‌ను పునరుద్దరిస్తున్నారు. నిత్యవసర సరుకులను అందుబాటులో ఉంచారు అధికారులు. బంగ్లాదేశ్‌లోనూ బుల్‌బుల్‌ గుబులు పుట్టించింది. బంగ్లా లో 16 మంది మరణించగా.. వందలాది మంది ప్రజలు గాయపడ్డారు. తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో 24 గంటలపాటు విమాన సర్వీసులు నిలిపేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: