తిరుపతి వెంకటేశ్వర స్వామి.. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన దేవుడిగా చెప్పుకుంటారు. ఏడుకొండల వాడికి భక్తులు సమర్పించే కానుకలు అన్నీ ఇన్నీ కావు. కోట్లకు పడగలెత్తిన ధనవంతుడాయన. అయితే ఆయన ఆస్తులు, సొమ్ములు, నగదుకు సంబంధించి జగన్ సర్కారు ఓ కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇకపై తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన నగదు ఏదైనా ఇకపై ప్రభుత్వ బ్యాంకులో మాత్రమే జమ చేయాలని నిర్ణయించింది.

 

శ్రీవారి సొమ్ములు ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్ చేయరాదని, కేవలం ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే జమచేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి ప్రకటన జారీ చేసింది. మరి ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది...? టీడీపీ అధికారంలో ఉన్నన్నాళ్లూ శ్రీవారి ఆలయం చుట్టూ ఎన్నో వివాదాలు ముసిరాయి.

 

అందులో తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన వందల కోట్ల డిపాజిట్ల వ్యవహారం ఒకటి. స్వామివారి నిత్యాదాయం కోట్లల్లోనే ఉంది. ఇలా సమకూరిన ఆదాయంలో సుమారు రూ. 4000 కోట్ల రూపాయిల నగదులో రూ.1400 కోట్లను ప్రైవేటు బ్యాంకులో డిపాజిట్ చేసింది గత ప్రభుత్వం. ఇండస్ ఇండ్ అనే ప్రైవేటు బ్యాంకుల్లో టీటీడీ డబ్బును డిపాజిట్ చేయడాన్ని భక్తులు ఎంతో మంది తప్పు పట్టి కోర్టును సైతం ఆశ్రయించారు.

 

 

గత ప్రభుత్వం చేసిన ఈ వ్యవహారంపై హైకోర్టు ప్రస్తుత టీటీడీ పాలక మండలిని వివరణ కోరింది. వైవీ సుభ్బారెడ్డి అధ్యక్షతన టిటిడి పాలక మండలి దీనిపై పూర్తి స్థాయిలో చర్చజరిపింది. గతంలో తీసుకున్న ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్ల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నామని, కేవలం జాతీయ బ్యాంకుల్లోనే శ్రీవారి ఆదాయాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో భద్రపరుస్తామని హైకోర్టుకు తెలియబరిచింది. అంటే ఇక శ్రీవారి ఆస్తులు సేఫ్ అన్నమాట.

 

మరింత సమాచారం తెలుసుకోండి: