సుదీర్ఘంగా 52 రోజులు పాటు సాగిన ఆర్టీసి సమ్మెకు తెర పడింది. తెలంగాణ ప్రభుత్వం కార్మికులు సమ్మె చేపట్టిన మొదటి రోజు నుంచి సమ్మె చట్ట విరుద్ధమని చెప్తూనే వస్తుంది అయినా కార్మికులు సమ్మె వీడకుండా 52 రోజుల వరకు తీసుకువచ్చారు. దాదాపు 3 నెలలు గా జీతాలు అందక కార్మికులు తమ కుటుంబ పోషణకు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక నేపథ్యంలో నిన్న ఆర్టీసి సమ్మెను విరమిస్తున్నట్లు ఆర్టీసి జేఏసీ నేత అశ్వథామరెడ్డి ప్రకటించారు. అయితే విధుల్లోకి చేరుతామని చెప్పిన జేఏసీ నిర్ణయాన్ని హాస్యాస్పదంగా వర్ణించారు ఆర్టీసి ఇంచార్జ్ ఎండి సునీల్ శర్మ. దీనితో షాక్ తిన్న ఆర్టీసి కార్మికులు అశ్వథామరెడ్డి ని నిలదీస్తున్నారు. 

 

ఉన్నట్టుండి సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించడానికి నువ్వు ఎవరు అంటూ అశ్వథామరెడ్డి పై కార్మికులు ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి సూర్యాపేట ఆర్టీసీ డిపోలో ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. అశ్వత్థామరెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ.. ఎన్‌ఎంయూ జిల్లా నాయకుడు రవి నాయక్ ఈ ఘటనకు పాల్పడ్డాడు.  "ఛీ మనిషివేనా నువ్వు ఆర్టీసిని తాకట్టు పెట్టి కెసిఆర్ కు అమ్ముడుపోయావు కార్మికుల ఉసురు తగులుతుంది నీకు" అంటూ అశ్వథామరెడ్డి పై మండిపడ్డారు. ఇప్పటి వరకు కార్మికులకు హీరో గా ఉన్న అశ్వథామరెడ్డి సమ్మె విరమిస్తామని చెప్పి విలన్ గా మారారు. 

 

సమ్మె నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 32 మంది కార్మికులు చనిపోయారు వాళ్ళందరి ఉసురు నీకు తగులుతుంది అంటూ కార్మికులు శాపనార్ధాలు పెట్టారు. సమ్మె పేరుతో కార్మికుల జీవితాలతో చేలగాటమాడాడని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసి కార్మికులను చేర్చుకునేది లేదు అంటూ ఆర్టీసి ప్రకటించిన వేళ కార్మికుల పరిస్థితి రెంటికి చెడ్డ రేవులా తయారైంది. లేబర్ కోర్టు లో తీర్పు వచ్చాక మాత్రమే ఆర్టీసి కార్మికులను చేర్చుకునే అంశంపై ఆలోచిస్తామని ఆర్టీసి ఇంచార్జి ఎండి సునీల్ శర్మ పేర్కొన్నారు. 

 

ఇక ఈ ఉదయం విధుల్లోకి చేరేందుకు సంగారెడ్డి డిపో వద్దకు చేరుకున్న కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నల్గొండ జిల్లా లో కార్మికులు ఆందోళనలు చెయ్యడంతో నల్గొండ బస్టాండ్‌ వద్ద పోలీసులు 144 సెక్షన్‌ అమలు చేశారు, పలువురు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: