తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల వివరాలను ప్రకటించిన ఈసీ.. ఈ ఎన్నికల్లో దొంగ ఓట్లను అరికట్టేందుకు కొత్త యాప్ ను ప్రవేశ పెడుతోంది. 

 

తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. ఈనెల 14 సాయంత్రం మూడు గంటలకే నామినేషన్ విత్ డ్రా గడువు ముగియగా... 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్ లలో నామినేషన్లు ఉపసంహరించుకున్న అభ్యర్థుల వివరాలు అందడం ఆలస్యం అయింది. మొత్తం 12వేల 898 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. పార్టీలవారీగా బరిలో నిలిచిన తుది అభ్యర్థుల జాబితాను ఎస్‌ఈసీ ప్రకటించాల్సి ఉండగా జిల్లాల నుంచి పూర్తి సమాచారం, వివరాలు అందపోవడంతో ఆ వివరాలను అధికారికంగా ప్రకటించలేదు. మొత్తం వార్డులు, డివిజన్లు కలిపి 3,052 స్థానాలకు 25,768 నామినేషన్ లు రాగా వాటిలో 432 నామినేషన్ లు తిరస్కరణకు గురయ్యాయని, 25,336 నామినేషన్లు చెల్లుబాటు అయ్యాయని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. అయితే నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా 12438 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు వెనక్కు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

 

మున్సిపల్ ఎన్నికల బరిలో 12898 అభ్యర్థులు ఉండగా టీఆర్ఎస్ 2972, కాంగ్రెస్ 2616, సీపీఐ 177, సీపీఎం 166, ఎంఐఎం 276,  బీజేపీ 2313, టీడీపీ 347, స్వతంత్రులు 3750 ఉన్నట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా ఆదిలాబాద్ మునిసిపాలిటీలో ఎన్నికల బరిలో 286 మంది ఎన్నికల బరిలో ఉన్నారు. ఇక అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు కూడా పూర్తి చేయగా... బ్యాలెట్ పేపర్ల ముద్రణ ఏర్పాట్లు చేపట్టాల్సి ఉంటుందని రాష్ట్ర ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి. ఈనెల 22న ఉదయం 7 గంటల కు పోలింగ్ ప్రారంభం కానుండగా... 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ప్రచారం ముగించాల్సి ఉంటుంది. అవసరం అనుకున్న చోట్ల 24న రిపోలింగ్ నిర్వహిస్తామని, 25న మున్సిపల్ ఫలితాలు వెల్లడిస్తామని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు.


 
మున్సిపల్‌ ఎన్నికల తరుణంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ వి.నాగిరెడ్డి జిల్లా కలెక్టర్లు, ముఖ్య అధికారులతో వీడియో కాన్ఫిరెన్స్‌ నిర్వహించారు. పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ప్రతి వార్డుకు సగటున 1000 మంది ఓటర్లు ఉండడంతో... రెండేసి చొప్పున పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. సిరిసిల్లలో 39 వార్డుల పరిధిలో 74,750 మంది ఓటర్లకు 117 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటవుతున్నాయి. ప్రతి వార్డులో మూడు చొప్పున కేంద్రాలు ఉండనున్నాయి. ఏదేని వార్డులో ఓటర్ల సంఖ్య 1600కు మించితే మూడో పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికలు జరిగే 120 మునిసిపాలిటీల పరిధిలో 2,727 వార్డులు, 10 కార్పొరేషన్ల పరిధిలో 385 డివిజన్లు ఉన్నాయి. మొత్తం 53 లక్షలకుపైగా ఓటర్లు ఉండడంతో 7వేల పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయకుండా ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ను మొదటి సారిగా ప్రవేశ పెడుతున్నట్లు ఈసీ స్పష్టం చేసింది.

 

ప్రతి పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ తో పాటు వీడియో రికార్డింగ్ చేస్తామని ఈసీ వర్గాలు వెల్లడించాయి. కాగా భైంసా మున్సిపాలిటీలో ఎన్నికలు నిలిపివేయాలని బీజేపీ వినతిపత్రం అందజేసింది. అక్కడి కలెక్టర్, పరిశీలకులను వివరాలు కోరినట్లు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: