రాబోయే స్ధానిక సంస్ధల ఎన్నికల్లో ఏమి చేయాలో తెలీక జనసైనికుల్లో అయోమయం పెరిగిపోతోంది. ఒకవైపేమో ఎన్నికల హీట్ పెరిగిపోతోంది. మరోవైపేమో తమ అధినేత పవన్  కల్యాణ్ సినిమాల్లో  చాలా బిజీగా ఉంటున్నాడు. పైగా సినిమాల మీద సినిమాలకు సంతకాలు చేసేసి ఎవరికీ దొరకనంత బిజీ అయిపోయాడు. చివరకు ముఖ్యమైన పార్టీ నేతల సమన్వయ సమావేశాలకు కూడా హాజరుకావటం లేదు.

 

ఇటువంటి పరిస్దితుల్లో పార్టీ క్యడర్ కు సరైన దిశా నిర్దేశం చేసే వాళ్ళే కరువయ్యారు. ఏదో తాత్కాలికంగా సమన్వయ కమిటి సమావేశాలు నిర్వహించాల్సిందిగా సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ కు పవన్ బాధ్యతలు అప్పగించారు. అయితే నాదెండ్ల కెపాసిటి ఏమిటో అందరికీ తెలిసిందే. నాదెండ్ల చెబితే వినే నేతలు ఎవరూ లేరు, ఓట్లేసే జనాలూ లేరు.

 

ఈ పరిస్దితుల్లో ఏమి చేయాలో క్యాడర్ కు అర్ధం కావటం లేదు. పైగా ఏమి చేయాలన్నా బిజెపితో పొత్తు ఒకటి అడ్డుగా ఉంది. రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరిందని, సమన్వయంతో  వచ్చే ఎన్నికలను గట్టిగా ఎదుర్కొంటామంటూ రెండు పార్టీల నేతలు చాలా గంభీరంగా ప్రకటనలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే అప్పటి నుండి మళ్ళీ రెండు పార్టీల నేతలు కలిసి సమావేశాలు పెట్టుకోవటం కానీ కార్యాచరణ రూపొందించటం కానీ జరిగినట్లు లేదు.

 

ఎందుకంటే అక్కడ బిజెపి కూడా దాదాపు ఇదే పరిస్ధితుల్లో ఉంది. రాష్ట్రంలో బిజెపికి అసలు ఓటు బ్యాంకన్నదే లేదు. మొన్నటి ఎన్నికల్లో కమలం పార్టీకి వచ్చిన ఓట్లకన్నా నోటాకు వచ్చిన ఓట్లే  చాలా ఎక్కువ. బిజెపికి 0.84 శాతం ఓట్లు వచ్చిందంటేనే పార్టీ ఎంత బలంగా ఉందో అర్ధమైపోతోంది. కాకపోతే జనసేనతో పోల్చుకుంటే బిజెపికి ఓ పద్దతి ఉన్నట్లే లెక్క. మిగిలిన పార్టీలు అభ్యర్ధుల వేటలో స్పీడు పెంచేస్తుంటే జనసేన ఇంకా అధ్యక్షుడి ఆదేశాల కోసమే ఎదురు చూస్తోంది. ఇక్కడే అందరిలోను అయోమయం పెరిగిపోతోంది. చివరకు తెలంగాణాలో చేసినట్లే ఏపిలో కూడా పోటికి దూరమని ప్రకటిస్తారో ఏమో ఖర్మ.

మరింత సమాచారం తెలుసుకోండి: