కరోనా వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న ఇటలీలో బుధవారం ఒక్కరోజే 475 మంది చనిపోయారు. ఐరోపా దేశాల్లో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇటలీలో పరిస్థితి దారుణంగా ఉంది. అసలు వ్యాధి ప్రబలిన చైనాతో పాటు ఏ దేశంలోనూ ఒక్కరోజులో ఇంతమంది చనిపోలేదు. 

 


అంతేనా.. మరో 4వేల 207 మందికి కొత్తగా వైరస్‌ వచ్చింది. ఇటలీలో మొత్తం మృతుల సంఖ్య 2వేల 978కి చేరుకుంది. 35 వేల 713 మందికి వైరస్‌ సోకినట్లు తేలింది. వీరిలో 2వేల 257 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఇటలీలో ఇప్పటివరకూ 4వేల 25 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. 

 


ఇటలీ తర్వాత పరిస్థితి ఇరాన్‌లో దారుణంగా ఉంది. బుధవారం ఒక్కరోజే ఇరాన్‌లో 147 మంది మృతి చెందారు. 1192 మందికి వ్యాధి సోకింది. మొత్తం బాధితుల సంఖ్య 17వేల 361కి పెరిగింది. మృతుల సంఖ్య 1135కు చేరింది. స్పెయిన్‌లోనూ బుధవారం 105 మరణాలు నమోదయ్యాయి. మృతుల సంఖ్య  638కి చేరింది. 2వేల920 మందిలో కొత్తగా వైరస్‌ ఉన్నట్లు తేలింది.

 


అమెరికాలో కరోనా మరింత విస్తరించే ప్రమాదం ఉంది. అందుకే ట్రంప్ యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. రక్షణ ఉత్పత్తి చట్టాన్ని అమలుచేస్తామంటున్నారు. అంటే సైన్యమే ప్రజలకు అవసరమైన మాస్క్‌లు, గ్లౌజ్‌లు, పరీక్ష కిట్లు ఇతర వైద్యపరికరాలను తయారుచేస్తుందన్నమాట. లక్షలాది వెంటిలేటర్లను కూడా ఆర్డర్‌ చేస్తున్నట్లు ట్రంప్ చెప్పారు. 

 

ప్రస్తుత క్లిష్ట పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొంటామన్నారు ట్రంప్. కరోనా కారణంగా ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలను ఆదుకునేందుకు వంద బిలియన్ డాలర్లతో  ఏర్పాటుచేయనున్న అత్యవసర ప్యాకేజీకి యూఎస్ సెనేట్ ఆమోదం తెలిపింది. కరోనా ప్రభావంతో అమెరికా మార్కెట్లు 6 శాతానికిపైగా పతనమయ్యాయి. ఇలా ఒక దేశమనేముంది.. కరోనా దెబ్బతో ప్రపంచ దేశాలన్నీ విలవిల్లాడుతున్నాయి. మరి ఈ మహమ్మారికి ముకుతాడు ఎప్పుడు పడుతుందో..?

మరింత సమాచారం తెలుసుకోండి: