అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించరు. జరిగిన తర్వాత ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు. ఇది ఓ పాపులర్ తెలుగు సినిమాలోని డైలాగ్. ఇలాంటి అద్భుతమే చిత్తూరు జిల్లాలో ఒకటి చోటుచేసుకుంది. కరోనా పాజిటివ్ వ్యక్తికి ట్రీట్‌మెంట్ చేసే క్రమంలో అంతా ఆశ్చర్యపోయే అద్భుతం జరిగింది. 

 

కన్నతల్లి ప్రేమ ముందు కరోనా సైతం కరిగిపోయింది. చిత్తూరు జిల్లాలో కరోనా పాజిటివ్ వచ్చిన తల్లితో ఏడాదిన్నర వయసున్న చిన్నారి ఐసోలేషన్‌ సెంటర్లోనే ఉన్నాడు. ఇలా ఉండాల్సి రావడం నిజంగానే బాధాకరం. అయితే...తప్పనిసరి పరిస్థితుల్లోనే 17 రోజులు పాటు చికిత్స తీసుకుంటున్న తల్లి వద్ద ఉన్నాడు ఆ చిన్నారి. ఆ చిన్నారిని పరీక్షిస్తే మాత్రం నెగిటివ్ రిపోర్టులే వచ్చాయి. 

 

చిత్తూరు జిల్లాలో కొద్ది రోజుల క్రితం ఓ చిన్నారికి పెద్ద కష్టం వచ్చింది. తల్లికి కరోనా పాజిటివ్ రావడంతో చిన్నారి బాగోగులు పట్టించుకోవటానికి బంధువులు ఎవరూ ముందుకు రాలేదు. ఇటీవల ఢిల్లీ వెళ్లి వచ్చిన ఆ బాలుడి పెదనాన్నకు కరోనా పాజిటివ్‌ రాగా, తిరుపతిలో చికిత్స పొందుతున్నాడు. నగరి పట్టణంలో వారిది ఉమ్మడి కుటుంబం. నాన్నతో పాటు కుటుంబ సభ్యులనూ అనుమానితులుగా పరిగణించిన అధికారులు క్వారంటైన్‌ కేంద్రంలో ఉంచారు. అయితే...బాలుడి అమ్మతో పాటు అదే ఇంట్లో ఉంటున్న చిన్నమ్మకూ పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఇద్దరు తోడికోడళ్లను ఈ నెల 8న చిత్తూరులోని ఐసొలేషన్‌ కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. ఏడాదిన్నర వయసున్న ఆ బాబును బంధువులు ఎవ్వరూ పట్టించుకోలేదు. పాజిటివ్‌ వచ్చిన ఆ తల్లి.. తప్పనిసరి పరిస్థితుల్లోనే కుమారుడిని తనతో పాటు ఐసొలేషన్‌ కేంద్రానికి తీసుకెళ్లింది. ఆ బాబుకూ కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్‌ వచ్చింది. చిన్నారులు వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వాలు ప్రకటిస్తూనే ఉన్నాయి. ఐతే...ఇదంతా తెలిసినా చిన్నారిని పాజిటివ్ అయిన తల్లి వద్దనే ఉంచాల్సి వచ్చింది. అప్పటి నుంచి 17 రోజులు తల్లి వద్ద బాబు క్షేమంగానే ఆడుకుంటూ ఉన్నాడు.

 

అయితే.. అందరినీ ఈ 17 రోజుల పాటు ఒకటే భయం వెంటాడింది. తల్లి నుంచి కుమారుడికి కరోనా సంక్రమిస్తుందనే టెన్షన్ పట్టుకుంది. అమె ఉంటున్న ఐషోలేషన్‌ కేంద్రంలోని ఇతరుల వల్లా పిల్లాడికి కరోనా పాజిటివ్ వస్తుందని ఆందోళనకు గురయ్యారు. వరుసగా జరిగిన నిర్ధారణ పరీక్షల్లో నెగిటివ్ రావడంతో తల్లి, చిన్నమ్మతో పాటు బాబును డిశ్చార్జి చేశారు చిత్తూరు వైద్యులు. అసలు ఇది ఎలా సాధ్యం అయ్యిందో అంతుపట్టని విషయంగా మారిందంటున్నారు అధికారులు. తల్లి తను కరోనా పాజిటివ్‌ అని తెలిసినా ఏమాత్రం అధైర్యపడలేదు. బాబును అత్యంత జాగ్రత్తగా కంటికి రెప్పలా చూసుకుంది. బాబును ముట్టుకునేటప్పుడు శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకునేది. జలుబు, తుమ్ము వచ్చినప్పుడు వైద్యులు చెప్పిన జాగ్రత్తలు పాటించింది. బాబుకు నిత్యం పాలతో పాటు ఎగ్ కూడా అందించినట్లు వైద్యులు చెబుతున్నారు. ఆ చిన్నారికి ఉన్న ఇమ్యూనిటీ పవర్ కరోనా వైరస్‌ దరిచేరకుండా చేసిందంటున్నారు వైద్యులు. దీనిపై లోతైన అధ్యయనం చేస్తేనే మరింత విలువైన సమాచారం వచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇక...బయటకొచ్చిన బాబును చూసిన స్థానికులు...వైద్యులు సంతోషం వ్యక్తం చేశారు. రంజాన్ ప్రారంభమైన వేళ తమ కుటుంబం సభ్యులు, బాబు క్షేమంగా రావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: