ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో జగనన్న విద్యాదీవెన పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకం అమలులో భాగంగా గత నెలలో ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులను విడుదల చేసింది. తాజాగా జగన్ సర్కార్ జగనన్న విద్యా దీవెన కింద ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 9, 10 తరగతుల విద్యార్థులకు యూనిఫార్మ్ లు అందించటానికి సిద్ధమైంది. ఇందుకోసం 80 కోట్ల 43 లక్షల రూపాయలు విడుదల చేసింది. 
 
2020 - 2021 విద్యా సంవత్సరానికి 9,10 తరగతుల స్టూడెంట్స్ కు యూనిఫార్మ్ లు ఇచ్చేందుకు విద్యాశాఖ నుంచి ఉత్తర్వులు విడుదలయ్యాయి. ప్రభుత్వం యూనిఫార్మ్ జత కుట్టేందుకు 80 రూపాయల చొప్పున చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. సమగ్ర శిక్షణ పథకం కింద ఈ యూనిఫార్మ్ జతలను ప్రభుత్వం విద్యార్థులకు అందించనుందని తెలుస్తోంది. ప్రభుత్వం గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులందరికీ ‘జగనన్న విద్యా కానుక’ కింద ఆరు రకాల వస్తువులతో కూడిన స్పెషల్ కిట్లను అందజేస్తామని ప్రకటించింది. 
 
ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు చదివే విద్యార్థులు ఈ కిట్లను పొందనున్నారు. ప్రతి కిట్ లో ప్రభుత్వం 3 జతల యూనిఫామ్‌ క్లాత్, పాఠ్య పుస్తకాలు, నోట్‌ పుస్తకాలు, షూ, 2 జతల సాక్స్‌లు, స్కూల్‌ బ్యాగ్, బెల్టులను అందజేస్తుంది. ప్రభుత్వం యూనిఫామ్ కుట్టేందుకు అయ్యే డబ్బులను విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేస్తుంది. ఆగష్టు నెలలో స్కూళ్లు తెరిచే నాటికి ప్రభుత్వం కిట్లను పంపిణీ చేయనుందని తెలుస్తోంది. 
 
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా సీఎం జగన్ ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలల రూపురేఖలను మార్చనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటవ తరగతి నుంచి ఆరవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టేలా చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడేలా చేయడం కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: