మూలిగే నక్కపై తాటిపండు పడటం అంటే ఇదే. నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి కరోనా కష్టకాలం తెచ్చింది. ఆర్టీసీని అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతోంది. డీజిల్‌ రేట్లు పెరుగుదల.. ఆక్యుపెన్సీ లేక నానా అవస్థలు పడుతున్న ఆర్టీసీకి ఇప్పుడు కేసుల సమస్య కూడా మొదలైంది. సంస్థలోని కార్మికులు, ఉద్యోగులు కరోనా బారిన పడుతున్నారు. 

 

ఆర్టీసీ కార్మికులపై కరోనా వైరస్ ప్రతాపం చూపిస్తోంది. చాలా మంది కార్మికులు, ఉద్యోగులు ఇప్పటికే కరోనా బారిన పడ్డారు. టీఎస్‌ఆర్టీసీలో మొత్తం 49 వేల మంది ఉద్యోగులున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో 21 వేల మంది పని చేస్తున్నారు. హైదరాబాద్‌ పరిధిలో ఇప్పటికే ముగ్గురు ఆర్టీసీ ఉద్యోగులను కరోనా బలితీసుకుంది. మరో 27 మంది మహమ్మారితో పోరాడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిపోల్లో చాలా మంది డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లు.. ఇతర ఉద్యోగులు కరోనాతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

 

ఆర్టీసీ కార్మికుల ట్రీట్ మెంట్ కోసం తార్నాక ఆస్పత్రిలో కోవిడ్ వార్డు ప్రారంభించాలని ఆర్టీసి యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. కరోనా కష్టకాలంలో విధులు నిర్వహించి వ్యాధిబారిన పడ్డవారి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని యూనియన్ నేతలు కోరుతున్నారు. ఉద్యోగులు చనిపోతున్నా ఆర్టీసీ ఉన్నతాధికారుల్లో చలనం లేకపోవడాన్ని వారు తప్పు పడుతున్నారు. 

 

ఆర్టీసీ ఉద్యోగులకోసం హైదరాబాద్‌..  తార్నాకలో ఆసుపత్రి ఉంది. ఇందులో 200 పడకలున్నాయి. ఆర్టీసీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులందరూ ఇక్కడే వైద్య సేవలు పొందుతున్నారు. ఇక్కడ వసతులు అంతంతమాత్రమే. ఒక్క వెంటిలేటర్‌ కూడా అందుబాటులో లేదు. దీంతో కరోనా బాధితుల కోసం తగిన సౌకర్యాలతో ప్రత్యేక వార్డ్ ఏర్పాటు చేయాలని సిబ్బంది వేడుకుంటున్నారు. హకీంపేటలో ఆర్టీసీ శిక్షణ కేంద్రంలో క్వారంటైన్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

 

ఇప్పటికే  ఆస్పత్రిలో బెడ్లు దొరక్క.. వెంటిలేటర్ సదుపాయం అందుబాటులో లేక కొందరు ఆర్టీసీ ఉద్యోగులు కన్నుమూశారు. కష్టకాలంలో ప్రజలకోసం పనిచేస్తున్న తమపై ప్రభుత్వం శ్రద్ధపెట్టి.. కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ ఉద్యోగులు కోరుతున్నారు. 

 

ఓవైపు సంస్థ నష్టాలు.. మరో వైపు జీతాల్లో కోతలతో ఇబ్బందిపడుతున్న ఆర్టీసీ సిబ్బంది... కనీసం కరోనా సోకితే కూడా తగిన వైద్యం దొరక్కపోవడమేంటంటూ వాపోతున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: