ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీవర్షాలతో కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతోంది. పులిచింతలకు తోడు మునేరు వాగు నుంచి కూడా భారీగా వరద రావడంతో వరద నీరు విడుదల కావటంతో .. ప్రకాశం బ్యారేజి దగ్గర వరద ప్రవాహం ఏడు లక్షల క్యూసెక్కులకు చేరింది. వరద ఉధృతి పెరగడంతో బ్యారేజీ గేట్లన్నీ ఎత్తి వరద నీటిని విడుదల చేశారు. ఆదివారం రాత్రి నుంచే వరద ప్రవాహం పెరిగింది. ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.
గంట గంటకు పెరుగుతున్న వరద.. బెజవాడ వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఏకంగాఏడు లక్షలకుపైగా క్యూసెక్కుల వరద నీరు ప్రకాశం బ్యారేజ్ దగ్గర పోటెత్తడంతో.. నగరవాసులను ముంపు భయం వెన్నాడుతోంది. భారీగా వచ్చిన వరద నీటితో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరడంతో.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తోట్లవల్లూరు మండలంలో రొయ్యూరు, తోట్లవల్లూరు, చాగంటిపాడు, దేవరపల్లి గ్రామాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలకు నోటీసులు జారీ చేసిన అధికారులు...వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. మరోవైపు..తోట్లవల్లూరు మండలం కరకట్ట వెంబడి వున్న లంక గ్రామాలైన తోడేళ్లదిబ్బలంక, పాములలంక, కాళింగదిబ్బ, పొట్టిదిబ్బలంక, పిల్లివానిలంక, తుమ్మలపచ్చిలంక తదితర లంకల్లో వరద నీరు చేరింది. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
కృష్ణమ్మ వరద ఉధృతికి వందలాది ఎకరాల పంట నీటమునిగింది.జగ్గయ్యపేట, నందిగామ, పామర్రు, అవనిగడ్డ, పెనమలూరు ప్రాంతాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వరి, ప్రత్తి, మిర్చి, అరటి తోటలకు తీవ్ర నష్టంవాటిల్లింది. కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం గని అత్కూరు గ్రామంలో లంక పొలాల్లో వరి, పత్తి, మిర్చి, పసుపు పంటలు మునిగాయి. సుమారు 500 ఎకరాల నుండి 1000 ఎకరాల వరకు లంక పొలాల్లో నష్టం వాటిల్లినట్లు రైతులు చెబుతున్నారు. చందర్లపాడు మండలం రామన్నపేట గుడిమెట్ల ఏలూరు సుమారు రెండు వందల ఎకరాల వరకు పంట మునగటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కృష్ణా నది దిగువ ప్రాంతంలో వరదల కారణంగా ముంపుకు గురైన పంటపొలాలను పరిస్థితులను వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించారు. ఏడు లక్షల క్యూసెక్కుల వరద నీరు రావడంతో పంటలకు ఇబ్బందులు రావడం వాస్తవమే అంటున్న అధికారులు...నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపిన తర్వాత రైతులకు అవసరమైన ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని తెలిపారు
ఓ వైపు భారీ వర్షాలు, మరోవైపు వరదలు తమను తీవ్రంగా దెబ్బతీశాయని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం వీలైనంత వేగంగా పరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి