తెలంగాణతో పక్క రాష్ట్రాల రవాణా వ్యవస్థ అగాథంలో పడుతోంది. అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులపై తెలంగాణ పెట్టే ప్రతిపాదనలకు వ్యతిరేకత ఎదురవుతోంది. ఫలితంగా బస్సులకు బ్రేక్ పడుతోంది. ఇప్పటికే ఏపీతో ఈ వ్యవహారం ఎటూ తెగక బస్సులు తిరగడం లేదు. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర కూడా తెలంగాణకు సర్వీసులను నిలిపివేసే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల పునరుద్ధరణపై ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారుల మధ్య చర్చలు ఇక ముగిసినట్టేనని ఆర్టీసీ వర్గాలు భావిస్తున్నాయి. దసరా తిరుగు ప్రయాణాలకు బుకింగ్‌ వేళలు ముగుస్తున్న నేపథ్యంలో టీఎస్‌ఆర్టీసీ అధికారుల నుంచి సానుకూల సంకేతాలు వస్తాయని అధికారులు ఆశించారు. అయితే అటువైపు నుంచి ఏ విధమైన సమాచారం లేకపోవడంతో మరో రెండు రోజుల పాటు వేచిచూడాలనే నిర్ణయానికి ఏపీఎస్‌ఆర్టీసీ అధికారులు వచ్చారు. ఇదిలా ఉంటె తెలంగాణ ఆర్టీసీ ఉన్నతాధికారుల తీరుపై పక్క రాష్టాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. అంతర్ రాష్ట్ర ఒప్పందాలు ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర కూడా తెలంగాణకు బస్సులను సగానికి పైనే తగ్గించినట్లు తెలుస్తోంది.

అటు కర్ణాటక కూడా కేవలం ఈశాన్య కర్ణాటక సంస్థ నుంచి మాత్రం ఒకే జోన్‌లో బస్సులు నడుపుతోంది. నార్త్ సంస్థ నుంచి బస్సులను ఆపేశారు. ఈశాన్య సంస్థ నుంచి తిప్పుతున్న దానిపై కూడా కర్ణాటక త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని సమాచారం. తెలంగాణ పెడుతున్న కిలోమీటర్ల ప్రతిపాదనలకు ఏపీ మినహా మిగిలిన రెండు రాష్ట్రాల నుంచి సమాధానం రావడం లేదు. తెలంగాణ ప్రభుత్వం పంపిన లేఖలను పట్టించుకోవడం లేదు. ఏండ్ల నుంచి లేని ఈ విధానం కొత్తగా తెరపైకి తేవడంపై పక్క రాష్ట్రాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఇటీవలే మహారాష్ట్రకు చెందిన కొన్ని బస్సులకు తెలంగాణ జరిమానా విధించింది. అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసు నిబంధనలు ఉల్లంఘించిన పలు బస్సులను గుర్తించి ఫైన్ వేసింది తెలంగాణ రవాణా శాఖ.

మరింత సమాచారం తెలుసుకోండి: