గ్రేటర్ హైదరాబాద్‌కు కాబోయే మేయర్ ఎవరు.? డిప్యూటీ మేయర్ ఎవరికి దక్కనుంది?. ఏ పార్టీకి మెజార్టీ మార్క్ సీట్లు రాకపోవడంతో.. మేయర్ ఎన్నికలో ఎక్స్ అఫిషీయో సభ్యుల ఓట్లు కీలకంగా మారాయి.

ఏ పార్టీకి మెజార్టీ మార్క్ సీట్లు రాలేదు. టీఆర్‌ఎస్ అతి పెద్ద పార్టీగా ఉంది. ఆ పార్టీకి ఎక్స్‌ అఫిషియో ఓట్లు కూడా మిగతా పార్టీల కంటే ఎక్కువగా ఉన్నాయి. అయినా సరే.. అవి కూడా సరిపోయేలా కనిపించడం లేదు. ఏదో ఒక పార్టీ మద్దతు తీసుకోక తప్పని సరి పరిస్థితి. ఇలాంటప్పుడు మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు కారు పార్టీకే దక్కుతాయా?. మేయర్ ఎన్నికలో కార్పోరేటర్లతో పాటు ఎక్స్‌ - అఫిషియో సభ్యులు కూడా కీలకం కానున్నారు.

గ్రేటర్‌ పరిధిలో ఉండే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, వేరే కార్పోరేషన్‌లో నమోదు చేయించుకోని ఎమ్మెల్సీలు కూడా ఎక్స్‌ అఫీషియో ఓటర్లుగా నమోదు చేయించుకోవచ్చు.  గ్రేటర్ పరిధిలో 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో టీఆర్ఎస్ సభ్యులు 17 మంది, ఎంఐఎం ఎమ్మెల్యేలు ఏడుగురు, బీజేపీకి ఒకరు ఉన్నారు. ఎమ్మెల్సీలు 17 మంది ఉంటే టీఆర్ఎస్‌కి 14 మంది, ఎంఐఎంకి ఇద్దరు, బీజేపీకి ఒకరు ఉన్నారు. లోక్‌సభ ఎంపీలు ఐదుగురుంటే కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎంకి ఒక్కొక్కరు, టీఆర్‌ఎస్‌కు ఇద్దరు ఎంపీలు ఉన్నారు. రాజ్యసభ ఎంపీలు కేకే, డీఎస్ ఉన్నారు. వీళ్లు కాక కొత్తగా ఎన్నికైన ముగ్గురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్ ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఓటును రిజిస్టర్‌ చేసుకోనున్నారు. ఈ లెక్కన చూస్తే గ్రేటర్‌లో 55 ఎక్స్‌ అఫిషియో ఓట్లు ఉన్నాయి.

హైదరాబాద్ చుట్టు పక్కన ఉన్న మున్సిపాలిటీల్లో జరిగిన ఎన్నికల్లో పది మంది ఎక్స్‌అఫిషియో సభ్యులు  తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఒకసారి ఓటు వేసిన వారికి మరోసారి ఓటు వేసే అవకాశం ఉండదు. మేయర్ ఎన్నికల్లో కార్పోరేటర్లతో పాటు ఎక్స్ అఫిషియో సభ్యులను కూడా కలిపి లెక్కిస్తారు. మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికకు జీహెచ్‌ఎంసీ చట్టంలో ప్రత్యేక నిబంధనలను పొందుపర్చారు. కొత్తపాలకవర్గం కొలువుదీరడానికి ముందుగా హైదరాబాద్‌ కలెక్టర్‌ను రిటర్నింగ్‌ అధికారిగా నియమించి.. మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీచేస్తుంది. ఈ క్రమంలోనే ఎక్స్‌అఫీషియో సభ్యులుగా నమోదు చేసుకొనేందుకు అవకాశమిస్తూ రిటర్నింగ్‌ అధికారి మరో నోటిఫికేషన్‌ ఇస్తారు.

గ్రేటర్‌ పరిధిలో ఓటుహక్కు ఉండి, ఇతర ఏ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో గతంలో ఓటుహక్కును వినియోగించుకోని లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎక్స్‌అఫీషియో సభ్యులుగా నమోదు చేసుకోవచ్చు. అనంతరం 150 మంది కార్పొరేటర్లు, ఎక్స్‌అఫీషియోలతో కలిపి మేయర్‌ ఎన్నిక కోసం ఓటర్ల జాబితాను రూపొందిస్తారు. ఏ పార్టీకి మెజార్టీ రాకపోవడంతో  ఎక్స్ అఫిషియో ఓట్లు కూడా కీలకంగా మారాయి. గ్రేటర్‌లో ప్రజాప్రతినిధులుగా ఉన్న వారిలో ఎవరిని ఓటర్ల జాబితాలో చేర్చాలనే దానిపై కసరత్తు చేస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: