స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులపై నీలినీడలు
వరంగల్, కరీంనగర్ పనులు జరిగేనా
స్మార్ట్ సిటీలు.. కావాలా..వద్దా కేంద్రం సీరియస్
స్మార్ట్ సిటీ ప్రాజెక్టులపై నీలినీడలు కమ్ముకున్నాయి. రాష్ట్ర వాటాగా ఇవ్వాల్సిన నిధులు ప్రభుత్వం విడుదల చేయకపోవడంపై
కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఆసక్తి లేకపోతే
వరంగల్,
కరీంనగర్ లను స్మార్ట్‌సిటీల జాబితా నుంచి తొలగించి కొత్తవాటిని ఎంపిక చేస్తామని
కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ తేల్చిచెప్పింది. ఈ ప్రాజెక్టులకు కేంద్రం ఇప్పటివరకు విడుదల చేసిన నిధులను వెనక్కి ఇచ్చేయాలని కోరింది.
వరంగల్, కరీంనగర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులకు కేంద్రం రూ.196 కోట్ల చొప్పున విడుదల చేసింది. అంతే మొత్తం మ్యాచింగ్ గ్రాంట్‌గా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. రాష్ట్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోగా... తామిచ్చిన నిధులను ఖర్చు చేయకపోవడం పై కేంద్రం తీవ్రంగా స్పందించింది. స్మార్ట్ సిటీ మిషన్ మార్గదర్శకాల ప్రకారం కేంద్రం విడుదల చేసిన నిధులను ఏడు రోజుల్లోగా రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల స్పెషల్ పర్పస్ వెహికల్స్ (ఎస్పీవీ)కు బదలాయించాల్సి ఉంటుందని, సమాన మొత్తంలో రాష్ట్ర వాటా నిధులను ఇవ్వాల్సి ఉంటుందని గుర్తు చేసింది.
2016 మేలో గ్రేటర్
వరంగల్, ఆగస్టులో కరీంనగర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులను కేంద్రం రాష్ట్రానికి మంజూరు చేసింది.
కరీంనగర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు
కేంద్ర ప్రభుత్వం రూ.900 కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు రూ.196 కోట్లు విడుదల చేసింది. వాటిలో రూ.125 కోట్ల నిధులు మాత్రమే స్మార్ట్‌సిటీ ఖాతాకు జమ అయ్యాయి. మరో 71 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వద్దే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ వాటా నుంచి ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు. రూ.266.66 కోట్ల అంచనాలతో ప్రస్తుతం 9 పనులు కొనసాగుతున్నాయి.