చెన్నై : దేశంలో కల్లోలం సృష్టిస్తున్న కరోనా మహమ్మారిని ఎదుర్కునేందుకు రంగం సిద్ధమైంది. దేశ వ్యాప్తంగా కరోనా టీకా పంపిణీకు ప్రభుత్వం నడుం బిగించింది. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాలకు కరోనా టీకా డోసులు చేరుకున్నాయి. తమిళ నాడుకు కూడా కరోనా వ్యాక్సిన్ చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విజయభాస్కర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా టీకా వేసుకొని మద్యం సేవించ వద్దని ఆయన ప్రజలకు సూచించారు. ఆయన వ్యాఖ్యలు విన్న తర్వాత.. టీకా తీసుకొని మద్యం తాగడం వల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉందా? అని అనుమానాలు తలెత్తుతున్నాయి. చెన్నైకు చేరుకున్న కరోనా టీకాను రాష్ట్ర వ్యాప్తంగా 10 మండలాలకు మంగళవారం తరలించారు. తిరుచ్చికి చేరుకున్న టీకాను ఖాజామలై ప్రాంతంలో ఉన్న ఆరోగ్య శాఖ సహాయ డైరెక్టర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రంలో జాగ్రత్త పరిచారు. ఈ కేంద్రాన్ని బుధవారం ఉదయం ఆరోగ్య శాఖ మంత్రి డా. సి. విజయ భాస్కర్‌ సందర్శించారు. ఇక్కడ ఏమైనా అవసరాలు ఉన్నాయా? అని ఆరా తీశారు. ఆయనతో పాటు పర్యాటక శాఖ మంత్రి వెల్లమండి ఎన్‌. నటరాజన్‌, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్‌. వలర్మతి, కలెక్టర్‌ శివరాజు తదితరులు ఈ కేంద్రాలను సందర్శించారు.

తిరుచ్చి నుంచి ఇతర జిల్లాలకు టీకాలను తరలిస్తున్న ప్రత్యేక వాహనాలను మంత్రి విజయ భాస్కర్ ప్రారంభించారు. పచ్చజెండా ఊపి వీటిని ఆరంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి.. కరోనా టీకా రాష్ట్రంలోని పది మండలాలకు తరలించి, అక్కడి నుంచి జిల్లాలకు ప్రత్యేక వాహనాల ద్వారా తరలిస్తామని చెప్పారు. ఈ నెల 16వ తేదీ టీకాలు వేసే కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో దీనికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. టీకా విషయంలో సోషల్‌ మీడియాలో వస్తున్న వదంతులను ప్రజలు నమ్మవద్దని, అవన్నీ నిరాధారమైన పుకార్లని ఆయన తెలిపారు. ఇలా వదంతులు సృష్టిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: