నిమ్మగడ్డ రమేష్ కుమార్. గత ఏడాదిగా మీడియాలో నానుతున్న పేరు. ఆయన గత ఏడాది కరోనా వేళ చూసి స్థానిక ఎన్నికలను వాయిదా వేశారు. అలా వార్తల్లోకి వచ్చారు. మొత్తానికి ఎన్నో సినిమా ట్విస్టుల మాదిరిగా ఏపీ సర్కర్ వర్సెస్ నిమ్మగడ్డ గా భారీ ఎపిసోడ్ ఒక ఏడాది పాటు కొన‌సాగింది. ఎట్టకేలకు వాటిని అన్నింటినీ  దాటుకుని ఆయన విజయవంతంగా పంచాయతీ ఎన్నికలను పూర్తి చేశారు.

మరో వారం రోజులు ఆగితే మునిసిపల్ ఎన్నికలు కూడా పూర్తి అవుతాయి. ఒక విధంగా ఏపీ లోకల్ బాడీస్ లో మేజర్ పార్ట్ పూర్తి అయినట్లే. ఇక మిగిలింది పరిషత్ ఎన్నికలు. మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులకు ఎన్నికలు నిర్వహించే ఘట్టం మిగిలి ఉంది. అయితే దానికి కొన్ని అడ్డంకులు ఉన్నాయి అంటున్నారు. ఏకగ్రీవాల మీద అప్పట్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అందువల్ల గతంలో ఆపిన చోట నుంచే తిరిగి నిర్వహిస్తారా లేకపోతే కొత్తగా నోటిఫికేషన్ జారీ చేస్తారా అన్నది చూడాలి.

దీని మీద కొందరు కోర్టుకు వెళ్లారు. మరి కోర్టు ఏం చెబుతుంది అన్నది చూడాలి. న్యాయపరమైన మార్గదర్శకాలతోనే నిమ్మగడ్డ పరిషత్ ఎన్నికలు నిర్వహించాలని చూస్తున్నారు. ఆయన పదవీ కాలం ఈ నెల 31తో పూర్తి అవుతుంది.అంటే గట్టిగా పాతిక రోజులు ఆయన చేతిలో ఉంది. దాంతో కోర్టు తీర్పును ఆసరాగా చేసుకుని నిమ్మగడ్డ ఆ ఎన్నికలను కూడా నిర్వహించి మరీ తన పదవీ విరమణ చేస్తారని అంటున్నారు.

మొదట్లో ఆయన హయాంలో ఎన్నికలు వద్దు అన్న జగన్ సర్కార్ చివరికి కోర్టు ఆదేశాలతో దారికి వచ్చింది. నిమ్మగడ్డ కూడా ఎక్కడా పక్షపాతం చూపించకుండా చక్కగానే ఎన్నికలను నిర్వహిస్తున్నారు అన్న పేరు తెచ్చుకున్నారు. మొత్తానికి పరిషత్ ఎన్నికలు కూడా ఆయన నిర్వహిస్తే లోకల్ బాడీస్ కి  ఏ బాకీ లేకుండా అన్ని పూర్తి అవుతాయి. అపుడు విజయవంతమైన ఎన్నికల అధికారిగా ఆయన హ్యాపీగా రిటైర్ కావచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: