తెలంగాణ‌లో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల హీట్ తారాస్థాయికి చేరుకుంటుంది. రెండు గ్రాడ్యుయేట్స్ నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ ప‌రిస్థితి ఘోరంగా ఉంది. ముఖ్యంగా
హైద‌రాబాద్-రంగారెడ్డి-మ‌హ‌బూబ్ న‌గ‌ర్ సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న బీజేపీ నేత రాంచంద్ర‌రావు ఈ సారి ఎన్నిక‌ల్లో ఏటికి ఎదురీదుతున్నారు. పార్టీ ఏర్ప‌డ్డాక బీజేపీ సొంతంగా గెలిచి... అక్క‌డ పార్టీ ప‌రువు నిలిపిన తొలి సీటు ఇది. ప్ర‌శ్నించే గొంతుకు ఓటేయాల‌ని.. ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్ప‌డ్డాక టీఆర్ఎస్‌ను కాద‌ని మ‌రీ గ్రాడ్యుయేట్లు బీజేపీ ఎమ్మెల్సీగా పోటీ చేసిన రాంచంద‌ర్ రావును ఎమ్మెల్సీగా గెలిపించారు.

ఈ ఎన్నిక అప్ప‌ట్లో టీఆర్ఎస్‌కు చెంప‌పెట్టుగా నిలిచింది. పైగా ఉద్యోగ‌సంఘాల నేత‌గా ఉన్న దేవీ ప్ర‌సాద్ ను కాద‌ని రాంచంద్ర‌రావుకు ప‌ట్టం క‌ట్టారు. ఇది అప్ప‌ట్లో బీజేపీకి వ‌చ్చిన సంచ‌ల‌న విజ‌య‌మే. అయితే ఇప్పుడు మాత్రం బీజేపీ తెలంగాణ‌లో పుంజుకుంద‌ని అంచ‌నాలు ఉన్నా.. ఈ గ్రాడ్యుయేట్స్ నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం బీజేపీకి అప్పుడు ఉన్నంత సానుభూతి అయితే లేదు. పైగా ఎమ్మెల్సీగా గెలిచాక రాంచ‌ద‌ర్‌రావు చేసిందేమి లేద‌న్న చ‌ర్చ‌లు కూడా ఉద్యోగ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి.

ఓవైపు రేవంత్ రెడ్డి… చిన్నారెడ్డి కోసం జోరుగా ప్ర‌చారం చేస్తున్నారు. మ‌రోవైపు వ్యూహాత్మ‌కంగా టీఆర్ఎస్ పీవీ కుమార్తెను బ‌రిలో దింప‌డంతో పాటు ప‌లువురు మంత్రుల‌ను ఇక్క‌డే మోహ‌రించేసింది. ఇక ప్రొఫెస‌ర్ కె. నాగేశ్వ‌ర్ కు ముందు నుంచి చాలా సంఘాల మ‌ద్ద‌తు ఉంది. పార్టీల‌కు అతీతంగా ఆయ‌న‌కు విద్యా, ఉద్యోగ వ‌ర్గాల్లో ప‌ట్టుంది. ఇంతమంది బ‌ల‌మైన అభ్య‌ర్థుల మ‌ధ్య‌లో బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ రాంచంద‌ర్ రావు ఓడిపోతాడ‌నే అంటున్నారు. మ‌రి ఈ బ‌హుముఖ పోటీలో ఈ గ్రాడ్యుయేట్స్ నియోజ‌క‌వ‌ర్గంలో ఎవ‌రు ఎమ్మెల్సీగా పాగా వేస్తారో  ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: