చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్.కే రోజా సెల్వమణి కి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ చేసి ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. మార్చి నెల చివరి వారంలో చెన్నై అడయార్‌లోని ఫోర్టీస్‌ మలర్‌ ఆస్పత్రిలో రెండు మేజర్ సర్జరీలు చేయించుకున్న ఆర్.కె.రోజా ఏప్రిల్ 4వ తేదీన డిశ్చార్జ్ అయ్యారు. కొద్ది వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్ల సూచించడంతో ప్రస్తుతం ఆమె చెన్నై నగరంలోని తన నివాసంలో బెడ్ రెస్ట్ తీసుకుంటున్నారు.

ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. రోజా కి ఫోన్ చేసి ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అంతే కాకుండా ఆమె త్వరగా కోలుకోవాలని కేసీఆర్ ఆకాంక్షించారు. రోజా కుటుంబ సభ్యుల బాగోగుల గురించి కూడా కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు.

ఇదిలా ఉండగా సాక్షాత్తూ సీఎం కేసీఆరే తనకు ఫోన్ చేయడం తో ఎమ్మెల్యే రోజా ఆనందం వ్యక్తం చేశారు. అలాగే సీఎం కేసీఆర్ తన కి ఫోన్ చేసి పరామర్శించారు అని ఆమె ఒక ప్రకటన ద్వారా తెలిపారు. వైద్యుల సలహాలు పాటించాలని కేసీఆర్ తనకు చెప్పినట్టు రోజా తన ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలకు చేసిన మంచి సేవలే నాయకులకు గొప్ప గుర్తింపు తెస్తాయని కేసీఆర్ తనకు చెప్పారని రోజా తెలిపారు.

అయితే సీఎం కేసీఆర్ కరోనా వైరస్ బారిన పడిన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోంది. అయితే కేసీఆర్ ఆరోగ్యం త్వరగా కుదట పడాలని రోజా ఆకాంక్షించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో సీఎం కేసీఆర్ ఆరోగ్యం కుదుటపడాలని, ఆయన త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు రోజా చెప్పుకొచ్చారు. కొద్ది రోజుల క్రితం జగన్ కూడా రోజా కి ఫోన్ చేసి ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. రాజకీయాల గురించి ఏ మాత్రం ఆలోచించకుండా ఆరోగ్యం మీదనే దృష్టి పెట్టాలని.. ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలని ఆయన రోజాకు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: