
దేశంలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా కేసులు భారీ ఎత్తున నమోదవుతున్నాయి. సెకండ్ వేవ్ లో నమోదవుతున్న కేసుల్లో చాలా మందికి ఊపిరి తీసుకోవడం కూడా కష్టమవుతుంది. ఈ పరిస్థితుల్లో హాస్పిటల్స్ లో చేరుతున్నారు. అయితే హాస్పిటల్స్ లో ఆక్సిజన్ కొరత వేధిస్తోంది. ఈ నేపథ్యంలో ఆక్సిజన్ కొరత తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం వీలైనంత వేగంగా చర్యలు చేపడుతున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక మీదట తయారయ్యే ఆక్సిజన్ సహా ఇప్పటికే తయారై ఉన్న ఆక్సిజన్ మొత్తం కేవలం మెడికల్ అవసరాలకు మాత్రమే వాడాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
అంతేగాక ఆక్సిజన్ ఉత్పత్తి చేసే పరిశ్రమలను ఆ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవాలిసిందిగా కూడా ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు హోంశాఖ కార్యాలయం ట్విట్టర్లో ప్రకటించింది. ఈ రోజు దేశంలో ఆక్సిజన్ పరిస్థితిపై కేంద్ర హోం శాఖ సమీక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆక్సిజన్ ఉత్పత్తి చేసే అన్ని సంస్థలు వీలైనంత ఎక్కువ ఆక్సిజన్ ఉత్పత్తి చేయాలని అలాగే ఆక్సిజన్ అంతా ప్రభుత్వానికి మెడికల్ పర్పస్ కోసం వాడుకునేందుకు ఇవ్వాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
ఇక మరోపక్క విశాఖ ఉక్కు కర్మాగారానికి పెద్ద ఎత్తున ప్రశంసల వెల్లువ కురుస్తోంది. దేశంలో మొట్టమొదటిసారిగా విశాఖ ఉక్కు కర్మాగారం నుంచి ఆక్సిజన్ సిలిండర్ ల తో నిండి ఉన్న రైలు వివిధ ప్రదేశాలకు బయలుదేరింది. ఈ నేపథ్యంలో విశాఖ ఉక్కు పరిశ్రమ మీద ప్రశంసలు కురిపిస్తున్నారు పలువురు ప్రముఖులు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ప్రాణవాయువు అందిస్తున్న RINL ను ఆ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న బ్యాడ్మింటన్ స్టార్ సింధు అభినందించారు. విశాఖ ఉక్కు కృషిని ఈ దేశం మరువబోదు, విశాఖ ఉక్కు కృషిని అందరూ గౌరవిస్తూ కరోనా నిబంధనలు పాటించాలని ఆమె కోరారు.