తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు హుజూరాబాద్ ఉపఎన్నిక చుట్టూనే తిరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఉపఎన్నికలో గెలవాలని ప్రధాన పార్టీలు గట్టిగానే ప్రయత్నం చేస్తుండగా, ఈ ఉపఎన్నికలో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ తెలంగాణ ప్రజల్లో ఉంది. అయితే హుజూరాబాద్ ఉపఎన్నిక ప్రధానంగా టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ గానే జరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఇంకా గట్టిగా చెప్పాలంటే టీఆర్ఎస్ వర్సెస్ ఈటల అనే విధంగా ఉపపోరు జరుగుతుంది. ఇక్కడ కాంగ్రెస్ కాస్త వెనుకబడి ఉందనే చెప్పొచ్చు.

ఇక ఉపఎన్నికలో గెలవడానికి ఎవరి వ్యూహాలు వారికి ఉన్నాయి. ఇప్పటికే కేసీఆర్..తమ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులని హుజూరాబాద్ పంపించారు. వారు అక్కడే మకాం వేసి కారు గుర్తుకు ఓటు వేయాలని తిరుగుతున్నారు. హుజూరాబాద్‌లో గెలవడానికి కేసీఆర్ వందల కోట్లతో పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు.

అటు ఈటల రాజేందర్ పాదయాత్ర చేస్తూ, నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరినీ కలవడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. ఈయనకు బీజేపీ నేతల సహకారం కూడా బాగానే ఉంది. పలువురు బీజేపీ నాయకులు హుజూరాబాద్‌లో మకాం వేసి, ఈటల గెలుపు కోసం తిరుగుతున్నారు. ఇదే సమయంలో హుజూరాబాద్ ప్రచారానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ వస్తారా? లేదా అనే అంశంపై క్లారిటీ రావడం లేదు. ప్రస్తుతం జనసేన, బీజేపీలు పొత్తులో ఉన్న విషయం తెలిసిందే.

అయితే ఈ పొత్తు ఎక్కువగా ఏపీలోనే నడుస్తున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణలో ఆ రెండు పార్టీల మధ్య పెద్ద సఖ్యత ఉన్నట్లు కనిపించడం లేదు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్, బహిరంగంగా టీఆర్ఎస్ అభ్యర్ధికి మద్ధతు ప్రకటించారు. దీంతో తెలంగాణ బీజేపీ నేతలు, పవన్‌ని కాస్త దూరం పెట్టారు. కాకపోతే ప్రజల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న పవన్‌ని హుజూరాబాద్ ప్రచారంలో దించితే ఈటలకే ప్లస్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  కానీ బీజేపీ, పవన్‌ని ప్రచారానికి ఆహ్వానిస్తుందా? లేదా? అనేది తెలియాలి. ఒకవేళ ఆహ్వానించినా...పవన్ వస్తారా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. మరి చూడాలి ఉపఎన్నిక షెడ్యూల్ వచ్చాక పవన్ ఎంట్రీ ఉంటుందేమో.

మరింత సమాచారం తెలుసుకోండి: