నిజంగా ఇది టీడీపీ వాళ్ల‌కు పెద్ద ఉత్సాహం ఇచ్చే వార్తే అని చెప్పాలి. టీడీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడు నారా లోకేష్ పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు పార్టీలోనూ, ప్ర‌భుత్వంలోనూ ఓ రేంజ్లో చ‌క్రం తిప్పారు. ఒకానొక ద‌శ‌లో లోకేష్ మ‌రీ ఓవ‌ర్ చేస్తున్నాడ‌ని.. పార్టీలో అంద‌రిని ఇంకా చెప్పాలంటే సీనియ‌ర్ల‌ను సైతం డామినేట్ చేసే స్తున్నాడ‌న్న విమ‌ర్శ‌లు కూడా వ‌చ్చాయి. అలాంటి లోకేష్‌ను చంద్ర‌బాబు ఎమ్మెల్సీని చేసిన రెండు రోజుల‌కే త‌న కేబినెట్లో కీల‌క‌మైన మంత్రి ప‌ద‌వి ఇచ్చేశారు.

లోకేష్ మంత్రిగా ఉన్న‌ప్పుడు ఏపీలో ఎక్క‌డ ప‌ర్య‌టించినా కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు బ్ర‌హ్మ‌ర్థం ప‌ట్టేసేవారు. లోకేష్ ను భ‌విష్య‌త్ టీడీపీ అధ్య‌క్షుడిగాను.. భ‌విష్య‌త్ ముఖ్య‌మంత్రిగాను తెగ కీర్తించే వారు. అలాంటి లోకేష్ కు గ‌త ఎన్నిక‌ల్లో స‌రైన సీటు లేకుండా పోయింది. అస‌లు లోకేష్‌ను ఎక్క‌డ పోటీ పెట్టాలో కూడా చంద్ర‌బాబు సైతం చివ‌రి వ‌ర‌కు చాలా తిక‌మ‌క ప‌డ్డారు. ఎన్నో నియోజ‌క‌వ‌ర్గాల పేర్లు ప‌రిశీలించి చివ‌ర‌కు రాజ‌ధాని ప్రాంతం అయిన మంగ‌ళ‌గిరి నుంచి పోటీ పెట్టారు . ఆ ఎన్నిక‌ల్లో లోకేష్ ఓడిపోయారు.

లోకేష్ ఓడిపోయినా మంగ‌ళ‌గిరి లోనే పార్టీని డ‌వ‌ల‌ప్ చేస్తూ వ‌స్తున్నారు. తాజాగా జరిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో టీడీపీ స‌త్తా చాటుకుంది. ఇది లోకేష్‌కు నిజంగా పెద్ద ఉత్తేజం లాంటి వార్తే. దుగ్గిరాల మండ‌లంలో టీడీపీ పోటీ చేసిన 14 టీసీల‌కు గాను ఆ పార్టీ 9 చోట్ల విజ‌యం సాధించింది. ఇక దుగ్గిరాల జ‌డ్పీ టీసీ స్థానిన్ని సైతం పోగొట్టుకున్నా కూడా తుది వ‌ర‌కు పోరాడింది. దుగ్గిరాల జ‌డ్పీటీసీ టీడీపీ కేవ‌లం 800 ఓట్ల తేడాతో కోల్పోయింది.

ఏదేమైనా మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో ఈ స్థాయిలో ఫ‌లితాలు వ‌చ్చాయంటే అది టీడీపీకి నిజంగా ఉత్తేజం లాంటి వార్తే. మ‌రి ఇదే ఊపును వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల వ‌ర‌కు లోకేష్ కంటిన్యూ చేసుకుని వ‌చ్చే ఎన్నిక‌ల్లో అయినా అసెంబ్లీ మెట్లు ఎక్కుతాడేమో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: